Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ పోరాటం మరింత ఉధృతం
- 17న ప్రతిపక్ష పార్టీలకు ఎస్కేఎం లేఖలు
న్యూఢిల్లీ: రైతుల పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రైతు ఉద్యమానికి కృషి చేయమని ప్రతిపక్ష పార్టీలను కోరనుంది. ఈ నెల 22 నుంచి రైతులు పార్లమెంటు వెలుపల ప్రతిరోజూ నిరసన తెలుపుతామని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. సింఘూ సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. అనంతరం రైతు ఉద్యమ నాయకులు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జీత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి నిర్ణయాలు ప్రకటించారు. రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని 17న ఎస్కేఎం దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు లేఖలను పంపుతున్నట్టు తెలిపారు.
రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని జూలై 22 నుండి ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు సభ్యులు చొప్పున రోజుకు కనీసం రెండు వందల మంది రైతులు పార్లమెంటు వెలుపల ప్రతిరోజూ వర్షాకాలం ముగిసే వరకు నిరసన తెలుపుతారని తెలిపా రు. చమురు, వంట గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూశ్ గోయల్ డిసెంబర్ 2020 నుంచి జనవరి 2021 కిసాన్ మోర్చా ప్రతినిధులతో పదకొండు రౌండ్ల అధికారిక చర్చలు జరిపారనీ, రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు పేర్కొంటున్నారని అన్నారు. చట్టాల్లో నిబంధనలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతుందనీ, మూడు నల్ల చట్టాలను ప్రభుత్వం రద్దు చేయదని మంత్రులు పేర్కొంటున్నారని తెలుపారు. సవరణలు ఎందుకు పనిచేయవని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మ దగినవి కావనీ,చట్టం లక్ష్యం తప్పుగా ఉన్నప్పుడు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న ప్పుడు సవరణలు పనికిరావని అన్నారు. ఈ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా తీసుకువచ్చినట్టు రైతులు ఎత్తిచూపారని అన్నారు.
220వ రోజుకు రైతు ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమ ఆదివారం నాటికి 220వ రోజుకు చేరింది.