Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతకు వడ్డీ పీడన
- జీరోఇంట్రస్టు అంతంత మాత్రమే
- కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దగా
అమరావతి : రైతు రుణాలపై సున్నా వడ్డీ పథకం గందరగోళంగా తయారైంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ తాము భరిస్తామన్న వడ్డీ రాయితీ నిధులు సకాలంలో విడుదల చేయట్లేదు. దాంతో బ్యాంకులు పూర్తి వడ్డీ వసూలుకు రైతులను పీడిస్తున్నాయి. అసలు, వడ్డీ కలిపి ఒకే తడవ ఏక మొత్తంలో కట్టి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి. ఖరీఫ్ వేళ కొత్త పెట్టుబడులకు విరివిగా రుణాలివ్వాల్సిందిపోయి పాత అప్పుల పునరుద్ధరణ చేపట్టి పూర్తి వడ్డీ చెల్లించాలనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కరోనా విలయానికి అన్నదాతలు అన్ని విధాలా నష్టాలపాలై ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా, ఈ సమయంలో వడ్డీ వసూలుకు బ్యాంకులు పూనుకోవడం గ్రామ సీమల్లో ఆందోళనకరంగా తయారైంది.
గడువే అటంకం
రైతులకు ఏడు శాతం వడ్డీపై పంట రుణాలిస్తుండగా, రూ.లక్ష లోపు రుణాలపై కేంద్రం మూడు శాతం, రాష్ట్రం నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. దాంతో సున్నా వడ్డీపై పంట రుణాల పథకం అమల్లో కొచ్చింది. అయితే, ప్రభుత్వాల రాయితీ పొందా లంటే రైతులు తప్పనిసరిగా నిర్ణీత గడువు (గరిష్టంగా ఏడాది) లోపు తాము తీసుకున్న రుణాలను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాలన్న నిబంధన విధించారు. ఈ షరతు వలన రైతులు వడ్డీ రాయితీ పొందలేక పోతున్నారు.
లక్షకు ఏడు వేలు
నవరత్నాల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం 'వైఎస్ఆర్ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రతిపాదించడమే కాకుం డా రైతులు అసలు చెల్లిస్తే సరిపోతుంది, వడ్డీ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది అని హామీ ఇచ్చింది. తీరా గతేడాది జూన్ 30న విడుదల చేసిన మార్గదర్శకాల్లో రైతులు గడువు లోపు అసలు, వడ్డీ చెల్లించాలని, ఇ-పంట పోర్టల్లో నమోదైన రైతులకే పథకమని, బ్యాంకులు, వ్యవసాయశాఖ నుండి వచ్చిన వివరాల ప్రకారం రైతులకు తన వాటా నాలుగు శాతం వడ్డీని తర్వాత రీయింబర్స్ చేస్తామంది. అటు కేంద్రం సైతం తాను భరించే మూడు శాతం వడ్డీ రాయితీని ఎప్పటికో విడుదల చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో బ్యాంకులు రైతుల నుండి ముక్కుపిండి ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. రూ.లక్షకు రమారమి రూ.ఆరు వేల నుండి ఏడు వేల వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. సున్నా వడ్డీ అని ప్రభుత్వం చెబుతోంది కదా అని రైతులు ప్రశ్నిస్తే వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తాం, ముందు అంతా కట్టమంటున్నాయి. అసలే కరోనా కష్టాలతో ఖరీఫ్ సేద్యానికి పెట్టుబడుల్లేక అల్లాడుతున్న రైతాంగంపై పూర్తి స్థాయిలో వడ్డీలు కట్టాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది.
లబ్ధి పది శాతం లోపే
తర్వాతైనా ప్రభుత్వం నుండి వడ్డీ రీయింబర్స్ అవుతుందా అంటే అదీ లేదు. గతంతో పోల్చితే వైసిపి సర్కారు వడ్డీ రాయితీ నిధులు కొంత ఆలస్యంగా విడుదల చేస్తున్నప్పటికీ, లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా ఉంటోంది. 2019-20లో బ్యాంకులు రూ.89 వేల కోట్ల పంట రుణాలిచ్చాయి. వీటిలో రూ.లక్ష లోపు రుణాలు సుమారు రూ.70 వేల కోట్లు ఉండాయి. రాష్ట్రం తన వాటా కింద వడ్డీ రాయితీ రూ.2,800 కోట్లు పెట్టుకోవాలి. ఆ ఏడాది బడ్జెట్లో సున్నా వడ్డీకి ప్రతిపాదించిన నిధులు రూ.వంద కోట్లు. ఖరీఫ్, రబీ రెండు విడతల్లో సర్కారు విడుదల చేసిన సున్నా వడ్డీ 21 లక్షల మంది రైతులకు రూ.418 కోట్లు మాత్రమే. కేంద్రం నుండి సైతం అదే తీరుగా రీయింబర్స్ అయ్యాయి.