Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకోని కార్మికులు..
- ఇప్పటికీ ఇబ్బందులే
- పడిపోయిన ఆదాయాలు
- సాంత్వన చేకూర్చని ప్రభుత్వ సాయాలు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దేశంలోని ఎన్నో రంగాలు ఈ కఠిన కాలంలో నేల చూపులు చూశాయి. ఉద్యోగాలు కోల్పోయి ఎందరో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ముఖ్యంగా, దేశంలో కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారిన విషయం విదితమే. పనికి వెళ్తే కానీ పూట గడవని ఆ కుటుంబాలు ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూసినప్పటికీ అవి ఆశించినస్థాయిలో లేకపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించిన గతేడాది పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశ కార్మిక వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరోక్షంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా, దేశంలోని వలసకార్మికులు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నారు.స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 నివేదిక.. ప్రకారం.. గతేడాది లాక్డౌన్ కాలంలో కార్మికులు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. కారణం.. ఆదాయ వనరులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఆదాయ పంపిణీ దిగువన ఉన్న సగటున నలుగురు సభ్యుల కుటుంబం రూ. 15,700 కోల్పోయింది. అలాగే, అనేక స్వతంత్ర సర్వేలు అనధికారిక రంగ కార్మికులకు 40 శాతం నుంచి 80 శాతానికి పైగా ఆదాయంలో పదునైన తగ్గుదలను వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితులు లాక్డౌన్ కాలంలో మాత్రమే కాదనీ, తర్వాతి నెలల్లో కూడా కొనసాగాయని వివరించాయి.ముఖ్యంగా, బతుకు బండిని నెట్టే క్రమంలో రుణాలు తీసుకోవడం వంటివి కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టివేశాయి. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన కోవిడ్-19 జీవనోపాధి సర్వే ప్రకారం.. పేద కుటుంబాలు వారి నెలవారీ గృహ ఆదాయంలో దాదాపు నాలుగు రెట్టు రుణ భారం కలిగి ఉన్నాయి. అయితే, ఈ పెరిగిన రుణ భారం భవిష్యత్తులో కొనసాగే అసమానతల తీవ్రతను సూచిస్తుంది. ఇటీవలి నెలల్లో పెరుగుతున్న ఇంధనం, ఆహార ధరలు గృహ బడ్జెట్లను మరింత దిగజార్చాయి. ముఖ్యంగా పేదలు, కార్మికుల విషయంలో ఈ పరిస్థితులు కఠినంగా మారాయి.
సీఎంఐఈ సమాచారం ప్రకారం.. 2020 చివరి నాటికి ఉపాధి దాదాపు కొలుకున్నట్టుగా కనిపించింది. కానీ, ఆదాయాలు మాత్రం తీవ్ర నిరాశకు గురిచేశాయి. దేశవ్యాప్తంగా సుమారు 15 మిలియన్ల మంది కార్మికులు ఇప్పటికీ పనిలో లేకపోవడం గమనార్హం. ఇక సెకండ్‌వేవ్ నాటికి కార్మికులు ఫస్ట్‌వేవ్ షాక్ నుంచే పూర్తిగా కోలుకోలేకపోయారు. ఆరోగ్య సమస్యలు, గృహ ఆదాయాలు వంటివి సమస్యలుగా పరిణమించాయి.ఇక మహమ్మారి.. మహిళలు, యువ కార్మికులను అసమానంగా ప్రభావితం చేసింది. లాక్డౌన్ సమయంలో పనిచేసే మహిళలో నలభై ఏడు శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే, డిసెంబర్ వరకు కూడా తిరిగి పనిని పొందలేకపోయారు. కాగా, ఈ సమయాల్లో చాలా మంది మహిళలు సాధారణ వేతన కార్మికులుగా (43 శాతం మంది) ప్రవేశించారు. దాదాపు 54 శాతం మంది పురుషులు స్వయం ఉపాధిలోకి ప్రవేశించారు. స్వయం ఉపాధిని చూస్తే, మహమ్మారి సమయంలో కూడా, సాధారణ వేతన కార్మికుడు సంపాదించే దాని కంటే రెట్టింపు సంపాదించాడు. అయితే, కార్మికరంగం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు తగినంత మద్దతు లభించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపాయి. ఇప్పటికైనా కార్మిక రంగం కోలుకునేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.