Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవైపు పడిపోతున్న ఆదాయం..మరోవైపు ధరలపోటు
- భారీగా పెరిగిన మాంసం, గుడ్లు, పప్పులు, వంటనూనె ధరలు
- వంటగ్యాస్ సబ్సిడీకి కేంద్రం కోత
- రూ.578 నుంచి రూ.887కు పెరిగిన వంటగ్యాస్
మాంసం, గుడ్లు, పప్పులు, వంటనూనె ధరల చూస్తే..ఒంట్లో బలమేమోగానీ, గుండె కలుక్కుమంటోంది. గత ఏడాది మేలో రూ.545 ఉన్న వంటగ్యాస్ ధర రూ.887కు చేరుకుంది. ఈ ధరలపోటుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల పోషణ తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి వల్ల దేశ ప్రజల్లో అత్యధికభాగం పోషకాహారానికి దూరమవుతారని సామాజికవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆదాయం పడిపోయినవేళ..నిత్యావసరుకుల ధరలు సామాన్యుడ్ని మరింత కుంగదీస్తున్నాయి. పెరుగుతున్న ధరల్ని భరిస్తూ తన కుటుంబాన్ని పోషించెదెట్టా? అని ఆవేదన చెందుతున్నాడు. గత కొద్ది నెలలుగా ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెరుగుతు న్నాయి. లాక్డౌన్, కరోనా కారణంగా కుటుంబ ఆదాయాలు గణనీయంగా పడిపోయినవేళ, ఈ ధరల పోటేంటని సామాన్యుడు లోలోన కుమిలిపోతున్నాడు. పాలకులు దీనికి పరిష్కారం చూపలేరా? అని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో సామాన్యులకు అర్థం కావటంలేదు. వంటగ్యాస్ ధర మే 2020 నుంచి పెరుగుతూనే ఉంది. గత ఏడాది మేలో వంటగ్యాస్ ధర రూ.578 ఉండగా, ఈ ఏడాది జులై 1నాటికి రూ.887కు పెరిగింది. వీటి సబ్సిడీ మొత్తం కూడా మోడీ సర్కార్ లబ్దిదారుల ఖాతాల్లో వేయటం లేదు. గత ఏడాది కాలంగా సిలిండర్ ధరను మాత్రం 46శాతం వరకూ పెంచేసింది.
పప్పులు, కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పేదలు, మధ్యతరగతి కంది పప్పు, పెసర పప్పు, గుండుపప్పు...ఎక్కువగా వాడతారు. ఇవి ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 23శాతం పెరిగాయని, జనవరి నుంచి మటన్, చికెన్, గుడ్ల ధరలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత కొద్ది నెలల్లో చికెన్ ధర 33శాతం, మటన్ ధర 23శాతం పెరిగిందని సమాచారం.
పౌష్టికాహారలోపం..
వంట నూనె వాడకం లేకుండా దేనిని వండలేం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవనూనె, పల్లినూనె వాడకం ఎక్కువ. వీటి ధరలు వరుసగా 43శాతం, 37శాతం పెరిగాయి. పొద్దుతిరుగుడు, సోయానూనెలు సుమారుగా 47శాతం పెరిగాయి. అధిక ధరలు ఉన్నాయి..అని వీటిని వాడకుండా తప్పించుకోవటం సాధ్యం కాదు. మాంసం, పప్పులు కొనలేక పేదలు, మధ్య తరగతి కూరగాయల వాడకం పెంచారు. సుదీర్ఘకాలం ఇదే ధోరణి కొనసాగితే..ప్రజల్లో పౌష్టికాహారలోపం తలెత్తుతుందని సామాజికవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్రం పన్నుల మోత
మనదేశంలో డిమాండ్‌కు సరిపడా వంటనూనెలు ఉత్పత్తి కావటం లేదు. గత రెండేండ్లుగా దిగుమతులపైన్నే ఎక్కువగా ఆధారపడ్డాం. దేశీయంగా మార్కెట్ డిమాండ్‌లో 56శాతం దిగుమతులున్నాయి. వీటి దిగుమతులపై కేంద్రం పెద్దమొత్తంలో సుంకాలు,సెస్సులు విధిస్తున్నాయి.దాంతో ఈ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి.పామాయిల్‌పై 59.4శాతం, పొద్దుతిరుగుడు,సోయాబీన్ నూనెలపై 49.5శాతం దిగుమతి సుంకాలు విధించటం ధరల పోటుకు కారణమని తేలింది.
ప్రత్యేకబాక్స్లో..
గత ఏడాదికాలంగా సబ్సిడీ వంటగ్యాస్‌లో..సబ్సిడీకి మోడీ సర్కార్ కోత పెట్టింది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నగదు బదిలీ ద్వారా లబ్దిదారులకు అందిన మొత్తం రూ.2573కోట్లు. ఇది గత ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.445కోట్లకు తగ్గింది. ఆ తర్వాత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.345కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(జనవరి 2021-మార్చి 2021) చివరి త్రైమాసికంలో రూ.196కోట్లకు తగ్గింది.
గుడ్లు..మాంసం
(జనవరి-మే 2021
మధ్యకాలంలో పెరిగిన ధర)
మటన్ - 23శాతం
చికెన్ - 33శాతం
చేపలు - 8శాతం
గుడ్లు - 12శాతం
పందిమాంసం - 23శాతం
పప్పులు
(జనవరి-మే 2021
మధ్యకాలంలో పెరిగిన ధర)
కందిపప్పు - 23శాతం
పెసరపప్పు - 17శాతం
శనగపప్పు - 14శాతం
మైసూర్‌పప్పు - 18శాతం
మినపప్పు - 13శాతం
వంటనూనె
(జనవరి-మే 2021
మధ్యకాలంలో పెరిగిన ధర)
ఆవనూనె - 43శాతం
పల్లినూనె - 37శాతం
కొబ్బరినూనె - 16శాతం
రిఫైన్డ్ ఆయిల్ - 47శాతం