Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్24 అఖిల పక్ష సమావేశంపై గుప్కార్
- అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గత నెల 24న జరిగిన అఖిల పక్ష సమావేశం నిరాశపరిచిందని గుప్కార్ పీపుల్స్ అలయెన్స్ కూటమి పేర్కొంది. గుప్కార్ రోడ్డులోని ఫరూక్ అబ్దుల్లా నివాసంలో ఆయన అధ్యక్షతన ఈ కూటమి నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గుప్కార్ వైస్ చైర్పర్సన్ మెహబూబా ముఫ్తీ, మహ్మద్ యూసఫ్ తరిగామి, జస్టిస్ (రిటైర్డ్) హస్నేన్ మసూది, జావెద్ ముస్తఫా మీర్, ముజఫర్ అహ్మద్ షా తదితరులు హాజరయ్యారు. సమావేశ వివరాలను గుప్కార్ అధికార ప్రతినిధి యూసఫ్ తరిగామి సోమవారం తన నివాసంలో మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశ ఫలితంపై గుప్కార్ కూటమిలోని సభ్యులంతా తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన తెలిపారు. రాజకీయ, ఇతర ఖైదీలనందరినీ జైలు నుంచి విడుదల జేయడం వంటి విశ్వాస నిర్మాణ చర్యలేవీ కేంద్రం ఇంతవరకు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చేరువవ్వాలంటే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రక్రియ చేపట్టాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రధానితో అఖిల పక్ష సమావేశం ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదని సిపిఐ (ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి ఆ రోజు నుంచి చెబుతూ వస్తున్నారు. కేంద్రం ఇష్టానుసారంగా అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడుతుండడంతో తీవ్ర అణచివేతకు గురవుతున్నామనే భావన జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకుల్లో నెలకొందని, కాశ్మీర్లో నిర్బంధాన్ని అంతమొందించే ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టేందుకు
ప్రధాని సుముఖత చూపలేదని ఆయన అన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని గుప్కార్ నేతలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందమే అవుతోందని తరిగామి అన్నారు. ఆగస్టు 5 తరువాత జమ్మూ కాశ్మీర్ ప్రజలపై బనాయించిన అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఎదుర్కోవాలని తామంతా కృతనిశ్చయంతో ఉన్నామని గుప్కార్ ప్రతినిధి అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని పార్లమెంటులో ప్రధాని, కేంద్ర హోం మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ఎలాంటి చర్యలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రం ప్రతిపాదించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ముందే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని గుప్కార్ డిమాండ్ చేసింది. మంగళవారం నుంచి జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్న పునర్విభజన కమిటీతో సమావేశమయ్యే విషయంలో గుప్కార్ ఉమ్మడిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.