Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్‌స్వామి మృతికి పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : స్టాన్‌స్వామి మృతి పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సోమవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణానికి కారకులైన సంబంధిత వారిని బాధ్యులుగా చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 84 ఏండ్ల ఈ సామాజిక ఉద్యమకారుడు జార్ఖండ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి పోరాడాడని పొలిట్‌బ్యూరో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో బీమా కోరేగావ్ కేసుకు సంబంధించి యూఏపీఏ కింద మోసపూరిత ఆరోపణలు మోపి జైలుకు పంపించారనీ, పార్కిన్సన్స్తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సంబంధిత అధికారులు చికిత్స నిరాకరించారని తెలిపింది. వివిధ మానవ హక్కుల, వికలాంగుల హక్కుల సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ల తరువాత మాత్రమే జైలులో ఆయనకు ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఒక సిప్పర్‌ను అందుబాటులో ఉంచారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తలోజా జైలులో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో.. ఖైదీలతో కిక్కిరిసిపోయివున్న బ్యారక్ల నుంచి వేరే ప్రాంతానికి తరలించాలన్న అభ్యర్థనను అధికారులు పట్టించుకోలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. బెయిల్ ఇవ్వాలని, ఇంటికి పంపించాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లను తిరస్కరించడం బాధాకరమని తెలిపింది. కరోనా బారిన పడిన తర్వాత స్టాన్‌స్వామి అరోగ్యం క్షీణిస్తున్న సమయంలో జోక్యం చేసుకొని ప్రయివేటు ఆస్పత్రిలో చేరేందుకు అనుమతించిన బాంబే హైకోర్టుకు పొలిట్‌బ్యూరో ధన్యవాదాలు తెలిపింది. అయితే అప్పటికే ఆలస్యం అయిందని, మరణాన్ని నివారించలేకపోయారని పేర్కొంది. స్టాన్‌స్వామిపై తప్పుడు కేసులు మోపి, జైలులోనే నిర్భందంలో ఉండేలా అమానవీయంగా వ్యవహరించిన వారు జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. బీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్నవారితో సహా, క్రూరమైన యూఏపీఏ, రాజద్రోహం వంటి రాజకీయ ప్రేరేపిత కేసుల్లో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజలు తమ ఆగ్రహాన్ని నిరసనల రూపంలో తెలియజేయాలని, రాజ్యాంగం హమీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల కోసం పరిరక్షణ కోసం పోరాడాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
ఎన్పీఆర్డీ సంతాపం
స్టాన్‌స్వామి మృతికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) సంతాపం ప్రకటించింది. జార్ఖండ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అట్టడుగు పరిస్థితుల్లో ఉన్న ఆదివాసీల జీవితాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాతంగా పోరాటాలు చేశారని పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు చికిత్స, మందులు అందించడంలో క్రూరంగా వ్యవహరించారని, కరోనా ఉధృతి సమయంలో జైలులోని భయంకరమైన పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు అభ్యర్థనలు చేసుకున్నా.. బెయిల్ మంజూరు చేయలేదనీ, కనీసం మరో ప్రాంతానికి తరలించలేదని ఎన్పీఆర్డీ తెలిపింది. స్టాన్‌స్వామికి సకాలంలో చికిత్స అందించకపోవడం వలనే మరణానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేసింది.