Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు ఇబ్బందులే : విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాలు దేశ ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రైల్వే రంగం, రక్షణ రంగం, బ్యాంకింగ్ సెక్టార్ ఇలా అనేక రంగాలలో 'ప్రయివేటు'కు మోడీ సర్కారు దారులు పరిచిన విషయం విదితమే. ఈ విధంగా ప్రభుత్వరంగ సర్వీసులను ప్రయివేటుపరం చేయడం ద్వారా అది దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. బ్యాంకుల ప్రయివేటీకరణతో ప్రజల హక్కులపై ప్రభావం ఏర్పడటంతో పాటు పేద ప్రజలకు అందే సర్వీసులు పూర్తి స్థాయిలో వారికి అందే అవకాశం ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి జన ధన్ యోజన (పీఎంజేడీవై) వంటి ప్రధాన ప్రభుత్వ పథకాలకు ఇటువంటి ప్రయివేటీకరణ అంతగా ఉపయోగపడదని వారు వాదించారు. ఈ విధానం బ్యాంకుల ద్వారా వారికి అందే కనీస చేయూతను కూడా అడ్డుకుంటుందని వివరించారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించి ఏడాదిన్నర గడుస్తున్నది. మహమ్మారి ధాటికి ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఉన్నది. కరోనా కాలంలో దేశంలో ప్రతికూల వృద్ధిరేటు, నిరుద్యోగ సమస్య, నిరర్థక ఆస్తుల పెరుగుదల వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌పై సహజంగానే అంచనాలు పెరిగాయి. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రయివేటీకరణపై ప్రకటనలు చేసింది. ఆర్థిక లోటును తగ్గించే ప్రయత్నంలో భాగంగా పీఎస్‌బీల ప్రయివేటీకరణపై నిర్ణయం తీసుకున్నట్టు సీతారామన్ చేసిన ప్రటకలపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో ప్రభుత్వ చర్యలపై బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులు భారీ సమ్మెకు దిగిన విషయం విదితమే. ఇలాంటి నిరసనలే మరికొన్ని కొనసాగుతున్నాయి. అయితే, నిరసనల ఎఫెక్ట్‌తో సీతారామన్ ఉద్యోగులను చల్లబరిచే ప్రయత్నాలు చేశారు. ''ఉద్యోగుల జీతాలు లేదా స్కేల్ పెన్షన్, అన్ని విషయాలపై ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటాం'' అని కేంద్ర మంత్రి ప్రస్తావించి వారిలో భయాలను తొలగించడానికి చూశారు. అయితే, ఇది కేవలం ఉద్యోగుల సమస్యగానే కేంద్రం చూసినట్టుగా కనిపిస్తున్నదనీ, వాస్తవానికి మాత్రం ఇది ప్రజల ఆందోళన అని నిపుణులు చెప్పారు. '' బ్యాంకుల ప్రయివేటీకరణ అర్థం ఏమిటీ? అది కూడా కరోనా మహమ్మారి కాలంలో ఎందుకు?'' అని వారు ప్రశ్నించారు. జీరో అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్, బీమా వంటి సౌకర్యాలు కల్పించే ఈ పథకాన్ని పీఎస్బీ లే ప్రజల చేరువకు తీసుకెళ్లి లబ్దిని చేకూర్చగలుగుతాయని నిపుణులు చెప్పారు. అయితే, బ్యాంకింగ్ రంగా న్ని ప్రయివేటుపరం చేయడం ద్వారా ఇలాంటి సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని కేంద్రం హామీ ఇవ్వగలదా? అని వారు ప్రశ్నించారు.