Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లజెండాలతో రైతుల నిరసన
- ఢిల్లీకి భారీగా తరలివస్తున్న అన్నదాతలు
యమునానగర్ : రైతులను దెబ్బతీసేలా అమల్లోకి తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమంటూనే ఉన్నాయి. హర్యానాలో బీజేపీ, జేజేపీ మంత్రులు, నేతలకు అన్నదాతలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నారు. హర్యానా హౌం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్‌కు సోమవారం నిరసన సెగ తగిలింది. యమునా నగర్ మీదుగా హరిద్వార్‌కు బయలుదేరిన మంత్రిని రైతులు అడ్డుకున్నారు. రోడ్ థాచ్ బెండ్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. రైతులు కూడా అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నల్లజెండాలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై విరుచు కుపడ్డారు. పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయినా వెనక్కితగ్గని అన్నదాతలు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఢిల్లీకి భారీగా..
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ సరిహద్దులో చేస్తున్న దీక్షలకు భారీగా మద్దతు లభిస్తున్నది. పంజాబ్, అమృత్సర్ నుంచి మహిళా రైతులు కదంతొక్కారు. మోడీ ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉద్యమానికి అండగా నిలుస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేననీ, ఎన్నిరోజులైనా దీక్షలను విరమించేది లేదని రైతు నేతలు స్పష్టం చేశారు. సోమవారం దీక్షాస్థలికి చేరుకున్న వాల్మీకి సంఘం నేతలు రైతులకు మద్దతు ప్రకటించారు.