Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగల్కోట్: కర్నాటక డిప్యూటీ సీఎం సావడి లక్ష్మణ్ కుమారుడు చిదానంద్కు చెందిన కారు ఢకొీని 56 ఏళ్ల ఒక రైతు మృతిచెందాడు. ఈ ఘటన బాగల్కోట్ జిల్లాలోని హంగండ్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో చిదానంద్ ప్రమాదానికి కారణమైన కారు వెనుక మరో కారులో వస్తున్నాడనీ, ఘటనా ప్రాంతాన్ని కొంత మంది స్థానికులు సెల్ఫోన్లలో రికార్డు చేయగా దాన్ని తొలగించాలని, లేకుండా తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతను బెదిరింపులకు పాల్పడ్డాడని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను చిదానంద్ ఖండిస్తున్నారు. కారు తనదేనని అంగీకరించాడు. అయితే ప్రమాద సమయంలో తాను ఆ కారులో లేనని, దైవదర్శనానికి అంజనాద్రి హిల్స్‌కు వెళ్లి తిరిగి స్నేహితుడి కారులో వెనుక వస్తున్నానని చెబుతున్నారు. బోలి కుడ్లెప్ప అనే రైతు సాయంత్రం సమయంలో ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. గాయాలపాలైన అయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మరణించారని తెలిపారు. బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో ఉన్న కారు డ్రైవర్ని కస్టడీకి తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పి లోకేష్ జగలాసర్ పేర్కొన్నారు.
అయితే ప్రమాద సమయంలో చిదానందే కారు డ్రైవ్ చేస్తున్నాడని కుడ్లెప్ప అల్లుడు మంగలప్ప అరోపిస్తున్నారు. ప్రమాదం గురించి డ్రైవర్ హనుమంతు సమాచారం ఇచ్చాడని, ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశామని చిదానంద్ అంటున్నాడు.
బాధిత కుటుంబసభ్యులను త్వరలో కలిసి తగిన సాయం చేస్తామన్నారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను డిప్యూటీ మంత్రి లక్ష్మణ్ ఖండించారు. కారు డ్రైవ్ చేయడాన్ని చిదానంద్ పదేండ్ల కిందటే మానేశాడనీ, హనుమంతునే కారు డ్రైవ్ చేస్తున్నారని పేర్కొన్నారు.