Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ
- పోలీసు ఉన్నతాధికారులతో ముఖాముఖీ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పశువుల అక్రమరవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాననీ, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయొచ్చని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో హిమంత్ బిస్వా శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవులను అక్రమంగా తరలించేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదనీ, చార్జీషీట్ నమోదు చేసేంతవరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆవు దైవంతో సమానమని అన్నారు. అలాగే తన ప్రభుత్వ హయాంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లను ఆయన సమర్థించుకున్నారు. కస్టడీ నుంచి నేరస్తులు పారిపోయేందుకు యత్నించినా, పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునేందుకు యత్నించినా.. పోలీసులు వారిపై కాల్పులు జరపవచ్చని అన్నారు. అత్యాచార నిందితుడు పారిపోయేందుకు యత్నించినపుడు అతనిని షూట్ చేసేందుకు చట్టం అనుమతిస్తుందనీ, అయితే కాళ్ళపై కాల్పులు జరపాలనీ, ఛాతీపై కాదని అన్నారు. ఎన్కౌంటర్లు నమూనాగా మారుతున్నాయా అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే.. అవునని సమాధానమిస్తానని హిమంత్ బిస్వా శర్మ పేర్కొన్నారు. చట్టప్రకారం ఒక వ్యక్తి తప్పు చేస్తే.. అతనిపై చార్జీషీట్ నమోదుచేసి దోషిగా నిర్థారింపబడతారని, అయితే తప్పించుకోవడానికి యత్నిస్తే.. వారిపట్ల సహనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్కౌంటర్లు చేసేందుకు పోలీసులకు అధికారం లేదని, ప్రజాస్వామ్యంలో నేరం చేసిన వారిపై చట్టం పోరాడుతుందని, ఇతర మార్గాలు లేనపుడు మాత్రమే ఎన్కౌంటర్ వంటివి జరుగుతాయని అన్నారు. గత మే నెల నుండి పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో 12 మంది ఎన్కౌంటర్లో మరణించగా, పలువురు గాయపడ్డారు. వీరంతా తప్పించుకునేందుకు యత్నిస్తుండగా కాల్పులు జరిపినట్లు పోలీసులు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. ఈ వరుస ఘటనలపై ప్రతిపక్షాలు దాడికి దిగాయి.