Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోపాల్ ఎపిసోడ్ మిస్
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో స్వదేశీ వ్యాక్సిన్‌గా ముందుకు వచ్చిన కోవాగ్జిన్ మూడవ దశ ఫలితాలకు సంబంధించిన శాస్త్రీయ పత్రాన్ని భారత్ బయోటెక్ పరిశోధకులు ఈ నెల 2న విడుదల చేశారు. పలు అనుమానాలకు తావునిచ్చేలా ఈ పరిశోధన పత్రం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పత్రంలో చాలా అంతరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ పరీక్షా ఫలితాల గణాంకాల వ్యత్యాసంతో పాటు పరీక్షల సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. ఇందులో డిసెంబర్ 2020లో కోవాగ్జిన్ 3వ దశ ట్రయల్స్ జరిపేందుకు భోపాల్‌లోని పీపుల్స్ ఆస్పత్రి (కోవాగ్జిన్ ట్రయల్స్ జరిపేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఒకటి) నగరంలోని పేదలు ఉండే నివాసాల నుంచి కొంత మందిని ఎంపిక చేసింది. వారిపై పరీక్షలు చేపడుతున్నామన్న విషయాన్ని వారికి చెప్పలేదు. బదులుగా వారిని సంసిద్ధులను చేసేందుకు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తున్నామని, ఇవి తీసుకుంటే రూ. 750 ఇస్తామని నమ్మించడంతో..వారు ట్రయల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ భోపాల్ ఎపిసోడ్‌కు సంబంధించిన వివరాలేమీ ఇటీవల విడుదల చేసిన పరిశోధనా పత్రాల్లో వెల్లడించలేదు. అంతేకాకుండా పరీక్షలు చేయించుకునే వారి పట్ల సదరు ఆసుపత్రి సరైన ప్రోటోకాల్స్ అనుసరించలేదని విస్పష్టమౌతోంది. ఈ విషయాలన్నింటినీ కూడా సైన్స్ జర్నలిస్ట్ ప్రియాంక పుల్లా బహిర్గతం చేశారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
ముందుగా ఈ బృందానికి పరీక్షలు చేపడుతున్నామని చెప్పలేదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ 750 రూపాయలు ఇచ్చారు. వీరంతా కూడా రోజు వారీ కూలేనని తెలుస్తోంది. వీరికి ఇది రెండు రోజలు వేతనంతో సమానం కాబట్టి ..వారు కూడా అంగీకారం తెలిపారు. ఇక మూడవది ఈ పరీక్షల్లో పాల్గొన్న వారికి ఉచిత వైద్య రక్షణ కూడా ఆసుపత్రి కల్పించలేదు. దానికి ఓ ఉదాహరణ... ఒక వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి జ్వరం రాగా, ఆసుపత్రికి వెళితే డయాగసిస్ చేసేందుకు సదరు వ్యక్తి నుండి రూ. 450 రూపాయలను వసూలు చేసింది. ఇక నాల్గవ అంశానికి వస్తే...తొలి డోసు ఇచ్చిన తర్వాత తేలికపాటి దుష్ఫ్రభావాలు ఎదుర్కొన్న కార్పెంటర్ జై రామ్‌ను ఒక్కసారంటే...ఒక్కసారి కూడా ఆసుపత్రి సంప్రదించలేదు. ఇక టీకా తీసుకన్నాక ఓ వ్యక్తి మరణించగా.. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.
గతంలోనే పలు ఆరోపణలు వచ్చినప్పటికీ కోవాగ్జిన్ అభివృద్ధికి కృషి చేస్తోన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ సంస్థలు. ఖండిస్తూనే ఉన్నాయి. ఐసిఎంఆర్ చీఫ్ డా. బలరామ్ భార్గవ్, కంపెనీ అధికార ప్రతినిధి ఒకే రాగం,తాళం పాడారు. తాము 2019 నాటి న్యూడ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ (ఎన్డీసీటీ) ప్రోటోకాల్‌ను అనుసరించామని చెప్పారు. ఆ ఆస్పత్రి నిబంధలను ఉల్లంఘించలేదంటూ ఐసీఎంఆర్ పేర్కొనగా, అయితే వారిపై పరీక్షలు చేపట్టిన తర్వాత వారికి అంగీకార పత్రాలు తాము ఇవ్వలేదని స్వయంగా ఆ ఆస్పత్రి వైస్ చాన్సలర్ వెల్లడించడం గమనార్హం. అదేవిధంగా రెండు డోసుల తర్వాత ఏడు ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పగా..ఒక్కటీ రాలేదని చెబుతున్నారు. కొంత మంది ఒకటి లేదా రెండు సార్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తావించాల్సిన మరో అంశం టీకా తీసుకునేందుకు వచ్చిన వారిలో చాలా మంది 1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనలోని బాధితులు, ఆ కుటుంబాల వారే. ఈ విషయంలోనే ఇప్పటికీ సరైన పరిహారం అందలేదన్నదీ మరో కోణం. కాగా, చాలా మంది బాధితుల్లో రెండవ డోసు తీసుకోవడానికి ముందు ఆస్పత్రి నిర్వాకం గురించి తెలుసుకున్నారు. మరోసారి పరీక్షకు హాజరుకాలేదు. మొత్తం ఈ దశలో 1379 మంది పరీక్షల నుండి వైదొలిగినట్టు భారత్ బయోటెక్ తెలిపింది.