Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదితో పోలిస్తే 25 శాతం అధిక ఫిర్యాదులు
- జాతీయ మహిళా కమిషన్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నదని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తాజా నివేదికలు వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి 25 శాతం అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపింది. 2020-21లో మహిళల నుంచి ఎన్సీడబ్ల్యూకి 26,513 ఫిర్యాదు అందాయి. 2019-20లో నమోదైన 20,309 ఫిర్యాదులతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. దాదాపు 25.09 శాతం ఫిర్యాదులు అధికంగా అందినట్టు నివేదిక పేర్కొంది. ఇందులో అధిక ఫిర్యాదులు గౌరవంగా జీవించే హక్కు ఉల్లంగించినదానికి సంబంధించినవి ఉన్నాయి. 2020-21లో ఈ ఫిర్యాదులు 8,688 అందగా.. 2019-20లో 5,061 నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో గృహ హింస ఫిర్యాదులు వచ్చినట్టు ఎన్సీడబ్ల్యూ తెలిపింది. 2019-20లో గృహ హింస ఫిర్యాదులు 3,369 రాగా, 2020-21లో 6,049 వచ్చాయి.వీటితో పాటు ఆందోళనకర స్థాయిలో మహిళలపై వరకట్న వేధింపులు, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్ నివేదిక తెలిపింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా పురుషులు ఎక్కువ గంటలు ఇంట్లోనే ఉండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్షీణించడం వంటి ఇతర కారణాల వల్ల మహిళలపై హింస పెరగడానికి ప్రధాన కారణం అయివుండవచ్చని ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు.
మహిళలపై ఆందోళనకర స్థాయిలో నేరాలు పెరుగుతున్నప్పటికీ.. మహిళలకు సాయం అందించడం, ఫిర్యాదులు అందుకోవడం కోసం సులభతరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ''బాధిత మహిళల ఫిర్యాదులు నమోదు చేయడం, వాటిని పరిష్కరించడం కోసం తమ బృందం లాక్డౌన్ సమయంలో మూడు షిప్టులలో పనిచేస్తున్నదని'' ఆమె చెప్పారు. రియల్ టైం డాష్‌బోర్డు ద్వారా ప్రతి ఫిర్యాదును ట్రాక్ చేస్తున్నామనీ, అన్ని సందర్బాల్లోనూ తగిన అనుసరణీయ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.