Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జల విద్యుత్ నూరు శాతం ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో 34ను సవాల్ చేసిన రిట్ పిటిషన్ మంగళవారం కూడా విచారణకు నోచుకోలేదు. ఏపీకి చెందిన జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు సాధ్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం పిటిషన్ సైతం దాఖలు చేసింది. రోస్టర్ పద్థతి ప్రకారం మీరు విచారణ జరపరాదని ఆ డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే, పిటిషన్ వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. తాము విచారణ చేస్తామని బెంచ్ చెప్పడంతో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ కల్పించుకుని.. ఏపీకి చెందిన మీరు (జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు) విచారణ చేయరాదని ప్రభుత్వం పిటిషన్ వేసిందని చెప్పారు.
తిరిగి ఏజీ కల్పించుకుని ఇదే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి దగ్గర తేల్చుకుంటామని, మధ్యాహ్నం వరకూ ఇక్కడి కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ విధంగా చేయడం వల్ల పోయేదేమీ లేదని బెంచ్ ప్రకటించింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. రోస్టర్ విధానం మేరకు మీరే విచారణ చేయాలనీ, జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు బెంచ్ విచారణ చేయరాదని ఏజీ చెప్పడంపై బెంచ్ మండిపడింది. రోస్టర్ విధానం మేరకు జరగలేదని చెప్పడానికి బదులు ఆ జడ్జి విచారణ చేయరాదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ మేరకు రిట్ పిటిషన్ ఏ విధంగా దాఖలు చేస్తారని కూడా ప్రశ్నించింది. ఇలా చేయడం న్యాయవ్యవస్థపై దాడి అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలానా జడ్జి విచారణ చేయాలని కోరడం ద్వారా తీర్పు అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నం చేయడమేనని తప్పుపట్టింది. దీంతో ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ఎజి చెప్పారు. అంతర్ రాష్ట్రాల మధ్య వివాదాలను తాము విచారణ చేస్తుంటే రెండో కోర్టును అత్యవసరంగా విచారణ చేయాలని ఏ విధంగా కోరతారని పిటిషనర్ న్యాయవాది వెంకటరమణను ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ ఇచ్చిన వివరాల మేరకు చేశామని చెప్పడాన్నితప్పుపట్టింది. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఇరువురికీ చెప్పింది. తమ వద్ద లేవనెత్తిన రోస్టర్ విధానం అమలు కాలేదన్న విషయాన్ని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు బెంచ్ దష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పింది. దీంతో మళ్లీ ఆ ఇద్దరూ జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు బెంచ్ దగ్గరకు వెళ్లి చెప్పారు. దీనిపై ఆయన స్పందిస్తూ, రాజ్యాంగ పదవిలో ఉన్న ఏజీ లాంటి వాళ్ల నుంచి ఈ తరహా డిమాండ్ రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు.
చెన్నమనేని పౌరసత్వ వివాద కేసు మళ్లీ వాయిదా
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాద కేసు మళ్లీ వాయిదా పడింది. దీనికి చెందిన డాక్యుమెంట్స్ విచారణ సమయంలో అందుబాటులో లేకపోయేసరికి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి చెప్పారు. ఇకపై వాయిదాలు ఉండబోవని చెప్పారు. ఇరుపక్షాలు వాదనలకు రెడీగా ఉండాలన్నారు.
ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు
కాబుల్ భారత రాయభార కార్యాలయంపై ఉగ్రవాదులు 2008లో జరిపిన దాడిలో రాయబారి వాడపల్లి వెంకటేశ్వరావు మరణిస్తే ఆమె భార్య మాలతీరావుకు ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వ జీవో ఏళ్ల తరబడి అమలు కాకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇంటి స్థలం ఇవ్వాలని 2014లో జీవో ఇచ్చారనీ, కొలతలకు అనుగుణంగా స్థలం లేదని చెప్పి ఇప్పటి వరకూ ఎందుకు సాకులు చెబుతున్నారని ప్రశ్నించింది. జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం ఇస్తామన్న హామీ మేరకు భరణి లేఔట్‌లోని ప్లాట్ 58లోని 475 గజాలను కేటాయించింది. కొలతల్లో అది 411 గజాలే ఉందంటూ మరో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వలేదని మాలతీరావు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని రిట్‌ను పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సారథ్యంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఫ్లాట్ నెం 53లోని స్థలం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదంటే ఏమనుకోవాలనీ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇలా ఉంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ నెల 27న జరిగే తదుపరి విచారణలోగా ఆమెకు ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఫీజు కట్టలేదని ఆన్లైన్ తరగతులకు అనుమతివ్వకపోవటం తప్పు
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఆన్లైన్ ఫీజులు పెంచడం, ఆపై ఫీజు కట్టలేదని ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వకపోడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం వేసిన పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఫీజు కట్టలేదని ఆన్లైన్ క్లాస్‌లకు అనుమతించలేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. విద్యాబోధనను అడ్డుకోరాదని, పరీక్షలకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించిన హైకోర్తు విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.