Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర అసెంబ్లీలో మూడు బిల్లులు
ముంబయి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు ప్రతిగా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అగాడి(ఎంవీఏ) ప్రభుత్వం మంగళవారం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వ్యవసాయం, సహకార వ్యవస్థ, ఆహారం పౌరసరఫరాలకు సంబంధించిన ఈ బిల్లుల్లో వ్యాపారులతో చేసుకున్న వ్యవసాయ ఒప్పందంలోని ఉత్పత్తులకు ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర, సకాలంలో బకాయిల చెల్లింపు, రైతులను వేధిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.5 లక్షల జరిమానా లేదా రెండు విధించేలా నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై నియంత్రణ విధించడం లేదా నిషేధించడంతో పాటు నిత్యావసర వస్తుల నిల్వలపై పరిమితి పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చే నిబంధనలు కూడా ఉన్నాయి. రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్ మాట్లాడుతూ ఎటువంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదింపజేసుకుందన్నారు. ఆయా చట్టాల్లోని కొన్ని నిబంధనలు రాష్ట్ర హక్కులను హరించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉన్నదనీ, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలకు సవరణలు సూచించాలని అనుకుంటున్నామని అన్నారు.