Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్వోతి రాదిత్య సింధియా, సోనోవాల్‌కు అవకాశం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోడీ సర్కార్ సిద్ధమైంది. నేడు (బుధవారం) క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే క్యాబినెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అటు కేంద్రమంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగడం ఖాయమని స్పష్టమైంది. కేంద్ర క్యాబినెట్లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. కాగా.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి అవకాశాలిచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రుల పనితీరు ఆధారంగా పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఇంకా 28 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చాలా మంత్రుల వద్ద ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయ మంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మోడీ సర్కారు దృష్టి పెట్టింది. కాగా 2019లో మోడీ రెండో దఫా ప్రధాని మోడీ పదవి చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. ఇప్పటికే ప్రధాని మోడీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. క్యాబినెట్ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. అయితే వీటిలో యూపీ నుంచి ఎక్కువ మందికి చోటు దొరికే అవకాశం ఉన్నది.
మంత్రులతో మోడీ భేటీ రద్దు
మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో మంగళవారం జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోడి భేటీ రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరగాల్సి ఉంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రహ్లాద్ జోషీ, పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు బీజేపీ జాతీయాధ్యక్షడు జెపి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈ భేటీలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది.
నాలుగు కోసం జేడీయూ పట్టు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగబోతున్న తరుణంలో జేడీయూ నాలుగు మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆయనకు మంత్రి పదవి ఇస్తే కోర్టుకు కెళ్తా : చిరాగ్ పాశ్వాన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారనే ప్రచారం నడుమ లోక్‌జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ హెచ్చరిక జారీ చేశారు. తన పార్టీ నుంచి బహిష్కృతుడైన పశుపతి పరాస్‌కు తన పార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పారు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇస్తే తాను కోర్టులో సవాల్ చేస్తానన్నారు. చిరాగ్ పాశ్వాన్ బాబాయి పశుపతి నాథ్ పరాస్‌కు మోడీ మంత్రి వర్గంలో చోటు దక్కబోతున్నట్టు వార్తలు రావడంతో చిరాగ్ ఘాటుగా స్పందించారు.