Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇథనాల్ ఉత్పత్తి కోసం సబ్సిడీ బియ్యం వాడుతున్న మోడీ సర్కార్
- సబ్సిడీ ధర వద్ద ప్రయివేటుకు 78వేల టన్నులు పంపిణీ
- ఇలాంటి నిర్ణయాలతో ఆకలి సమస్య మరింత పెరుగుతుంది : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : ప్రయివేటు పరిశ్రమలకు భారీ మొత్తంలో సబ్సిడీ బియ్యాన్ని కేటాయించాలని కొద్ది రోజుల క్రితం మోడీ సర్కార్ నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి 78000టన్నుల బియ్యాన్ని ప్రయివేటుకు సబ్సిడీ ధరల వద్ద కేంద్రం అందజేసింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం సబ్సిడీ బియ్యాన్ని కేటాయించటం సరైన నిర్ణయం కాదని, ప్రజా పంపిణీకి వెళ్లాల్సిన బియ్యాన్ని ప్రయివేటుకు తరలించటం అన్యాయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీరుపై సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో అత్యంత పేదలకు దక్కాల్సిన ఆహార ధాన్యాలు ఇలా ప్రయివేటు పరిశ్రమలకు కేటాయిస్తే..దేశంలో ఆకలి సమస్య మరింత పెరుగుతుం దని వారు హెచ్చరిస్తున్నారు.
చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి మోడీ సర్కార్ ఇలాంటి విధానాల్ని ఎంచుకోవటం బాధాకరమని వారు అన్నారు. ప్రపంచ ఆకలి సూచికలో(2020 ఏడాది) భారత్ 94వ స్థానంలో నిలబడిందని, ఈ విషయంలో పాకిస్థాన్ సహా పక్కనున్న దేశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. దేశంలో ఆకలి సమస్య తీవ్రత తెలిసివుండికూడా, కేంద్రం ప్రయివేటుకు సబ్సిడీ ఆహార ధాన్యాల్ని వాడటం చాలా దారుణమని వారు విమర్శించారు.
మన దేశంలో 2030నాటికల్లా పేదరికం, ఆకలి సమస్యను రూపుమాపాలన్నది ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. సబ్సిడీ బియ్యం ప్రయివేటుకు కేటాయిస్తే ప్రజా పంపిణీ దెబ్బతిని..లక్ష్యం ఎలా చేరుకుంటామని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. క్వింటా బియ్యాన్ని రూ.2000 ధర వద్ద ప్రయివేటు పరిశ్రమలకు (ఇథనాల్ ఉత్పత్తి కోసం) ఎఫ్సీఐ ద్వారా కేంద్రం అందజేసింది. ఇదే క్వింటా బియ్యాన్ని ప్రజా పంపిణీ కోసం రాష్ట్రాలకు రూ.2200 ధర వద్ద సరఫరా చేసినట్టు గణాంకాలు విడుదలయ్యాయి.
బియ్యం..చక్కెర కూడా !
ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్రం మొత్తం 418 పరిశ్రమల్ని గుర్తించింది. ఇందులో 70 పరిశ్రమలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సబ్సిడీ ధరలో రూ.2వేలకు క్వింటా బియ్యం చొప్పున 78వేల క్వింటాళ్లను పరిశ్రమలకు కేటాయించారు. ఇథనాల్ ఉత్పత్తిని 2025కల్లా 20శాతానికి పెంచాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ కోటా ముందు ముందు మరింత పెరగనున్నది. వచ్చే ఏడాది బియ్యమేగాక చక్కెరను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం అక్టోబరు 2021-సెప్టెంబరు 2022 మధ్య 35లక్షల చక్కెరను ప్రయివేటు పరిశ్రమలకు సరఫరా చేయబోతున్నారు.
ప్రయివేటుకు ఇవ్వటమేంటి?
కరోనా, లాక్డౌన్ సమస్యలతో రాష్ట్రాల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు లేక ఎక్కడా కూడా ఆదాయం పెద్దగా నమోదు కాలేదు. మరోవైపు ఆకలి సమస్యల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంది. ఈనేపథ్యంలో పెద్దమొత్తంలో ఆహార ధాన్యాల్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. అలా చేయకుండా.. అవసరం ఉన్నవారికి కాకుండా ప్రయివేటు పరిశ్ర మలకు సబ్సిడీ బియ్యాన్ని మంజూరుచేయటం దారుణం.
- దీపా సిన్హా, ఆర్థికవేత్త