Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్ హెచ్చార్సీ
న్యూఢిల్లీ: స్టాన్‌స్వామి మృత్తిపట్ల యూఎన్‌హెచ్చార్సీ చీఫ్ మిచెల్లీ బాచిలెట్, అమెరికా, ఈయూ మానవ హక్కుల విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని పలువురు ఆరోపించారు. భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్భంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్న ఏ ఒక్కరినీ నిర్బంధించరాదని యూఎన్ హెచ్చార్సీ స్పష్టం చేసింది.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..
స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఎల్గర్ పరిషత్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ ముంబయిలోని తలోజా జైలులో ఉన్నవారు బుధవారం నిరాహార దీక్షకు దిగారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధవాలే, మహేష్ రౌత్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, గౌతమ్ నవలఖా, ఆనంద్ తేల్తుంబ్డే, రమేష్ గైచోర్, సాగర్ గోరేలు నిరాహార దీక్షలో ఉన్నారు. స్టాన్‌స్వామిని సంస్థాగతంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, తలోజా జైలు మాజీ అధికారి కౌస్తుబ్ కుర్లేకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చట్టం ప్రకారమే చర్యలు : కేంద్రం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు, ఆదివాసీల గొంతుక, సామాజిక హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మరణం నేపథ్యంలో భారత ప్రభుత్వ తీరుపై దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగాను తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సైతం ప్రభుత్వం తీరును విమర్శించడంతో దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. చట్టం ప్రకారం తగిన ప్రక్రియను అనుసరించి స్టాన్ స్వామిని అదుపులోకి తీసుకున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
''స్టాన్ స్వామిపై మోపిన అభియోగాల నిర్దిష్ట స్వభావం కారణంగానే అతని బెయిల్‌ను దరఖాస్తులను కోర్టులు తిరస్కరించాయి. దేశంలో అధికారులు చట్ట ఉల్లంఘనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. హక్కులను చట్టబద్దంగా ఉపయోగించడానికి వ్యతిరేకంగా కాదు. భారత్ తన పౌరులందరి మానవ హక్కులను ప్రొత్సహించడంతో పాటు రక్షించడానికి కట్టుబడి ఉంది'' అని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ భాగ్చి పేర్కొన్నారు.