Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 20న ఢిల్లీ హైకోర్టు విచారణ
న్యూఢిల్లీ : నూతన ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద వార్తా సంస్థ అయిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొంది. పీటీఐ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ జె.ఆర్.మిధాలతో కూడిన బెంచ్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు ఆన్లైన్ వార్తా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి పీటీఐ పిటిషన్‌ను ఆగస్టు 20న విచారించనున్నది.
ఈ నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును పీటీఐ సవాలు చేసింది. కరెంట్ ఎఫైర్స్ సమాచారం, వార్తల ప్రచురణకర్తలను, ముఖ్యంగా డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌ను నియంత్రించేందుకు ఈ నిబంధనలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. నైతిక విలువల నిబంధనల సాకుతో ప్రభుత్వం పర్యవేక్షణ పెంచుతోందని తెలిపింది. ఈ నిబంధనలతో నిఘా, భయంతో కూడిన శకం ప్రారంభం కానుందని పీటీఐ తన పిటిషన్లో పేర్కొంది. తద్వారా స్వయం సెన్సార్షిప్ నెలకొంటుందని, ఫలితంగా, భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది.