Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురికి పదోన్నతి..
- 77కు చేరిన కేంద్ర మంత్రి మండలి
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకు న్నాయి. కొత్తగా 36 మందికి మంత్రిమండలిలో చోటుదక్కింది. 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. ఏడుగురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా లభించింది. మొత్తంగా 77 మందితో కేంద్ర మంత్రి మండలి కొలువుతీరనున్నది. 15 మంది క్యాబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్ వేదికగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే. పునర్వ్యవస్థీకరణ అనంతరం క్యాబినెట్లో 50 ఏండ్లలోపువారు 14 మంది ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో 46 మందికి ఇది వరకే మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. నారాయణ రాణే (మహారాష్ట్ర), శర్వానంద్ సోనోవాలా (అసోం) మాజీ ముఖ్యమంత్రులు. 18 మంది రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వారున్నారు. 13 మంది న్యాయవాదులు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు మాజీ ప్రభుత్వ అధికారులు, మరో ఏడుగురు రీసెర్చి డిగ్రీ, మరో ముగ్గురు బిజినెస్ డిగ్రీలు పూర్తి చేసిన వారున్నారు. విస్తరణ అనంతరం మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరనుంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే షెడ్యూల్ కులాలకు చెందిన 12 మంది, షెడ్యూల్ తెగలకు చెందిన ఎనిమిది మంది, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన 27 మంది మంత్రులుగా కొలువుతీరారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను దష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత లభించింది.
ఏడుగురికి పదోన్నతి
సహాయ మంత్రులుగా ఉన్న తెలంగాణకు చెందిన జి.కిషన్ రెడ్డితోపాటు హార్డీప్ సింగ్ పూరీ, ఆర్.కె సింగ్, అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, మన్సుక్ మాండవీయ, పురుషోత్తం రుపాలకు క్యాబినెట్లో చోటు దక్కింది. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డికి కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరీ.. కేంద్ర పౌర విమానయాన శాఖ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖలకు సహాయ మంత్రి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయనకు క్యాబినెట్ హౌదా ఇస్తున్నట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కిరణ్ రిజిజును క్యాబినెట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రీడల శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులకు కేబినెట్ హోదా కల్పించారు. పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా, పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మనుసుఖ్ మాండవీయను క్యాబినెట్లోకి తీసుకున్నారు.
12 మందికి ఉద్వాసన
12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తోపాటు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, రతన్ లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజరు ధోత్రే, రావు సాహెబ్ ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే, బాబుల్ సుప్రియో ఉద్వాసనకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ సిఫారసు మేరకు వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపై ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలతో తలపడిన విషయం తెలిసిందే. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్ రాజీనామా గమనార్హం. కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై, ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరతతో పాటు వ్యాక్సినేషన్ విధానంపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో హర్షవర్దన్ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. కర్ణాటక గవర్నర్‌గా నియమితులవ్వడంతో థావర్ చంద్ గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.
క్యాబినెట్ ఇదే..
మోడీ - ప్రధాని, శాస్త్ర సాంకేతిక శాఖ పర్యవేక్షణ
కిషన్‌రెడ్డి - పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ
హర్దీప్ సింగ్ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
మన్సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ
అమిత్ షా - హౌంశాఖతో పాటు ... కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ
అనురాగ్ఠాకూర్ - సమాచార, ప్రసారాలు, క్రీడలు
పీయూశ్ గోయల్ - వాణిజ్య శాఖ... అదనంగా జౌళి శాఖ
అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
భూపేంద్ర యాదవ్ -కార్మిక శాఖ
పశుపతి కుమార్ పారస్ - ఫుడ్ ప్రాసెసింగ్
స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
గిరిరాజ్ సింగ్- గ్రామీణాభివృద్ధి
పురుషోత్తం రూపాల - డెయిరీ, మత్స్య శాఖ
రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ - రవాణా శాఖ
నిర్మలా సీతారామన్ -ఆర్థిక శాఖ
నరేంద్రసింగ్ తోమర్ - వ్యవసాయశాఖ
డాక్టర్ జైశంకర్ -విదేశీ వ్యవహారాలు
అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం
ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
నారాయణ్ రాణే - చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ
డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం, సాధికారత
గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు శాఖ
గజేంద్రసింగ్ షెకావత్ - జల్‌శక్తి
కిరణ్ రిజిజు - న్యాయశాఖ
రాజ్‌కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ
భూపేంద్ర యాదవ్ - పర్యావరణ, అటవీశాఖ, కార్మిక శాఖ
మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ
పురుషోత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ