Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు పాఠశాలల తీరు అధ్వాన్నం
- మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కొరత : యూడీఐఎస్ఈ ప్లస్
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉన్నది. ప్రభు త్వం నుంచి మద్దతు లభించక మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కొరతతో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. భారతదేశం అంతటా దాదాపు 6000కుపైగా పాఠశాలలకు భవనాలే లేకపోవడం గమనార్హం. 2019-20 సంవత్సరానికి గానూ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీ ఐఎస్ఈప్లస్) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 6,465 పాఠశాలలకు తగిన భవనాలే లేవు. 35 భవనా లు శిథిలావస్థకు చేరుకున్నాయి. 4,417 పాఠశాలల భవనాలు నిర్మాణంలో ఉన్నా యి. తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం 15,07,708 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 10,32,570 పాఠశాలలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. 84,362 ప్రభుత్వ సహాయంతో, 3,37,499 అన్ఎయిడెడ్ ప్రయివేటు పాఠశాలలు కాగా, 53,277 పాఠశాలలను ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 77.34 శాతం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే విద్యుత్ కనెక్షన్ ఉన్నది. అలాగే, 84.23శాతం ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలు, 89.23శాతం ప్రయివేటు అన్ఎయిడెడ్ పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం కలిగి ఉన్నది. చాలా పాఠశాలల్లో బాలికలు, బాలురు ఇద్దరికీ ఫంక్షనల్ టాయిలెట్ సౌకర్యాలు ఉండగా, 10 శాతం పాఠశాలల్లో హ్యాండ్ వాష్ సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. అయితే, ఇలాంటి పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 29,967 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు లేవు. అన్ని పాఠశాలలు విద్యార్థులకు మెడికల్ చెకప్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. 2018-19 విద్యా సంవత్సరంలో 2,67,074 పాఠశాలలను దీనిని నిర్వర్తించకపోవడం గమనార్హం.
2019-20 ఏడాదిలో.. ప్రత్యేక అవసరాలు (సీడబ్ల్యూఎస్ఎన్) ఉన్న 22,49,117 మంది పిల్లలు చేరినప్పటికీ, 20.66 శాతం పాఠశాలల్లో మాత్రమే వారికి అనుకూలమైన మరుగుదొడ్లు ఉన్నాయి. 43.73 శాతం పాఠశాలల్లో మాత్రమే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు హ్యాండ్రెయిల్స్తో ర్యాంప్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16శాతం (2,40,007 స్కూళ్లు) పాఠశాలలకు లైబ్రరీ సౌకర్యాలు లేవు. ఇంకా, 9,47,959 పాఠశాలల్లో విద్యార్థులకు ఫంక్షనల్ కంప్యూటర్ సదుపాయాలు లేవు. కేవలం 28.55శాతం మాత్రమే ఫంక్షనల్ కంప్యూటర్ సదుపాయాలు కలిగి ఉన్నాయి. అసోం, బీహార్, మధ్యప్రదేశ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్ లలో 14 శాతం కంటే తక్కువ పాఠశాలలు ఫంక్షనల్ కంప్యూటర్ సదుపాయాలను కలిగి ఉండటం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా 11,71,826 పాఠశాలలు (87.72 శాతం) ఇంటర్నెట్ సౌకర్యాలను కలిగి లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో 11 శాతం, ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో 42.2 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 50.16 శాతం, ఇతర పాఠశాలల్లో 21.42 శాతం మాత్రమే ఇంటర్నెట్ సదుపాయాలను కలిగి ఉన్నాయి. అలాగే, అనేక ఇతర విషయాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిపోయాయి. దీంతో అవి ఆశించినస్థాయిలో ఫలితాలను తీసుకురాలేకపోతున్నాయి. గత కొన్నేండ్లుగా బడ్జెట్లో విద్య వాటా తగ్గిపోయింది. ఈ రంగం పట్ల కేంద్రం ఉదాసీనతను చూపించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్రం పాఠశాల విద్యకు కేటాయింపులను 8.3 శాతం తగ్గించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేక వెనకబడిపోతున్నారని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయంలో దృష్టి సారించి విద్యార్థుల బంగారు భవితకు దారి వేయాలని వారు సూచించారు.