Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ వివాదంపై కొత్త ఐటీ మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రవి శంకర్ ప్రసాద్ స్థానే ఐటీ శాఖ మంత్రిగా తాజాగా నియమించబడిన వైష్ణవ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్విట్టర్ వివాదంపై కేంద్రీకరించారు. ఐటీ, న్యాయ వ్యవహారాల మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు. ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఖాతరు చేయడం లేదు కదా అని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ దేశంలో నివసించే వారు, ఇక్కడ పనిచేసేవారెవరైనా సరే ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
ఐటీ నిబంధనలను పాటిస్తున్నాం: ట్విట్టర్
సమాచార సాంకేతికతకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా తాత్కాలిక ప్రాతిపదికన చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించినట్టు అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా త్వరలో మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అధికారులను నియమించనున్నట్టు న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. తాత్కాలిక ప్రాతిపదికన నోడల్ కాంటాక్ట్ పర్సన్‌ను మరో రెండు వారాల్లో, ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ ఆఫీసర్‌ను ఈనెల 11 నాటికి నియమిస్తామని తెలిపింది. ఈ మూడు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన ఇచ్చామనీ, నూతన ఐటీ నిబంధలనకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన మరో ఎనిమిది వారాల్లో ఆయా పోస్టుల్లో భారతీయులను నియమిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త రూల్స్‌ను పాటించడంలో ట్విట్టర్ విఫలమైందనీ, వినియోగదారుల పోస్టులకు సంబంధించి సంస్థకు ఉన్న జవాబుదారీ రక్షణ (లయబులిటీ ప్రొటెక్షన్)ను తొలగిస్తున్నట్టు కేంద్రం ఇటీవల కోర్టుకు తెలిపింది.