Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేస్‌బుక్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ కమిటీ (శాంతి, సామరస్యం) ముందు తప్పక హాజరుకావాలని సుప్రీంకోర్టు ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. ఢిల్లీ అసెంబ్లీ కమిటీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఫేస్బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజర్వ్‌లో ఉంచింది. సామాజికంగా సంక్లిష్టమైన సమస్యపై దర్యాప్తు శాసనసభ పరిధిలో ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు సందర్భంగా పేర్కొంది. ఫేస్బుక్ సంస్థ దోషి లేదా నిర్దోషి అని నిర్ధారించేందుకు దర్యాప్తు చేసే ప్రాసిక్యూషన్ ఏజెన్సీలా అసెంబ్లీ కమిటీ వ్యవహరించదని జస్టిస్ ఎస్కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. శాంతిభద్రతలు, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన పలు నిషేధిత జోన్లపై కమిటీ లోతుగా విచారణ చేయలేదని, అవి కేంద్రం పరిధిలో ఉంటాయని పేర్కొంది. అల్లర్ల కేసులో నిందితులపై క్రిమినల్ విచారణలు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నందున, ఆయా డొమైన్లకు సంబంధించి కమిటీ వేసే ప్రశ్నలకు ఫేస్బుక్ ప్రతినిధులు స్పందించాల్సిన అవసరం లేదని వివరించింది.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఫేస్‌బుక్‌పై ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు ఒక మీడియా సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు కమిటీ విచారణకు అనుగుణంగా లేవని పేర్కొంది.