Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రివర్గ తొలి భేటీలో నిర్ణయం
- కోకోనట్ బోర్డు యాక్ట్‌కు సవరణలు
న్యూఢిల్లీ :కరోనా సెకండ్ వేవ్ తరువాత తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి రూ. 23,000 కోట్లతో 'హెల్త్ ఎమర్జెన్సీ ప్యాకేజీ'ని ఇస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రకటించారు.ఈమేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
వ్యవసాయ చట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదు : తోమర్
కొత్త మంత్రివర్గం సమావేశం అయింది. గురువారం సాయంత్రం కేంద్ర క్యాబినెట్, మంత్రవర్గ భేటీ జరిగాయి. కేబినెట్ విస్తరణ జరిగిన తరువాత క్యాబినెట్ సమావేశం జరగడం ఇదే ప్రథమం. క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తోమర్ అన్నారు. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని, నూతన సాగు చట్టాల అమలు వల్ల మండీలకు కోట్ల రూపాయల లాభం వస్తుందని అన్నారు. ఏపీఎంసీలను (మండిలు) మరింత బలోపేతం చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద మండీలకు రూ.లక్ష కోట్లను కేటాయిస్తున్నట్టు తోమర్ ప్రకటించారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కోకోనట్ బోర్డు యాక్ట్‌ను సవర్తిస్తున్నామని ప్రకటించారు. కొబ్బరి బోర్డుకు అధికారులు ఉండరని, వారి స్థానంలో వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేవారు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కొబ్బరి క్షేత్రాన్ని మరింత జీర్ణించుకొని, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని తోమర్ అభిప్రాయపడ్డారు. ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను సభ్యులుగా చేరుస్తున్నామని తోమర్ ప్రకటించారు. కాగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు జరగడంతో గురువారం ఆయా మంత్రులు తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. పెట్రోలియం మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర ప్రసార మంత్రిగా అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఆరోగ్య మంత్రిగా మన్సుఖ్ మాండవీయ, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్, పౌర విమాన మంత్రిగా జ్వోతి రాధిత్య సింధియా, న్యాయమంత్రిగా కిరణ్ రిజిజు, కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖా మంత్రిగా జి.కిషన్ రెడ్డి, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమ శాఖ మంత్రిగా నారాయణ్ రణే, కార్మిక శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్ కుమార్ సింగ్, కేంద్ర స్టీల్ మంత్రిగా రామచంద్ర ప్రసాద్, ధర్మేంద్ర ప్రదాన్, గిరిరాజ్ సింగ్, సర్బానంద సోనోవాలా తోపాటు పలువురు బాధ్యతలు స్వీకరించారు.