Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీపై దాడులకు నిరసన: వ్యవసాయ కార్మిక, సామాజిక సంఘాల పిలుపు
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకంపై మోడీ సర్కార్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జూలై 26న దేశవ్యాప్త ఆందోళనలకు వ్యవసాయ కార్మిక, సామాజిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ కార్మిక, సామాజిక సంఘాల నేతలు బి వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ), గుల్జార్ సింగ్ గోరియా (బీకేఎంయూ), విఎస్ నిర్మల్ (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఏఐయస్కేయస్), ధీరేందర్ ఝా (ఏఐఏఆర్ఎల్ఏ), రామచంద్ర డోమ్ (డీఎస్ఎంఎం) జంకీ పాస్వాన్ (ఎన్సీసీడీఆర్), అశోక్ భారతి (ఏబీయంయంయూ), కాతిన్ చౌదరి (ఏఏఆర్ఎం) సంయుక్తంగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఎంఎన్ఆర్ఈజీఏపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ ఆందోళనలు జరుగుతాయని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. అంతకు ముందుకు అజరు భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎంఎన్ఆర్ఈజీఏ అమలులో ప్రతి అంశంలో సామాజిక వర్గీకరణ సమస్యలపై అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్, అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం, అఖిల భారత సంయుక్త కిసాన్ సభ, అఖిల భారత అగ్రగామి కృషి శ్రామిక్ యూనియన్, దళిత శోషణ్ ముక్తి మంచ్, దళిత హక్కుల జాతీయ ప్రచార మండలి, అఖిల్ భారతీయ ఎంఎన్ఆర్ఈజీఏ మజ్దూర్ యూనియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఉపాధి హామీ అమలులో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రభావం, షెడ్యూల్డ్ కులాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాలు అనే అంశంపై వివరంగా చర్చించారు. ఈ ఉత్తర్వులతో వ్యవసాయ కార్మికులకు చెల్లింపు పద్ధతిలో కొత్త సమస్యలను సృష్టించటంతోపాటు, వేతనాల చెల్లింపులో మరింత ఆలస్యమవుతుందని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. కుల వర్గీకరణను కేటాయింపులతో అనుసంధానించటం వల్ల చట్టం మరింత బలహీనమవుతుందన్నారు. అంతేకాక, లబ్దిదారులను కుల ప్రాతిపదికన విభజించేందుకు దారితీస్తుందన్నారు. ఇది చట్ట న్యాయమైన కార్యకలాపాలకు విరుద్ధమైనదని విమర్శించారు. కులం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ సమాన పని సూత్రం అమలుకు విఘాతం కల్పిస్తుందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా తొలుత ఈ నెల 26న అఖిల భారత నిరసనదినం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. దేశంలోని బ్లాక్, జిల్లాస్థాయిలో నిరసన ప్రదర్శనలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మోడీ సర్కార్ తెచ్చిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతామని నేతలు చెప్పారు. రాష్ట్రపతిని, గ్రామీణాభివృద్ధి మంత్రిని తమ ప్రతినిధి బృందం కలుసుకుని మెమోరాండం సమర్పించనున్నట్టు తెలిపారు.