Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిస్‌లోని 20 ప్రభుత్వ ఆస్తులు జప్తు
- సమాచారం లేదన్న ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థ ఓ పన్ను కేసు విషయంలో పారిస్‌లో ఉన్న భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకోనున్నది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 20 ప్రభుత్వ ఆస్తులు ఆ సంస్థ స్వాధీనం కానున్నాయి. భారత ప్రభుత్వం రుణ పడిన 8,972 కోట్లలో కొంత భాగాన్ని రాబట్టుకోవడానికి ఈ ఆస్తులను సొంతం చేసుకోవడానికి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్-భారత పెట్టుబడుల ఒప్పందాన్ని (బీఐటీ) ప్రభుత్వం ఉల్లంఘిస్తూ తమ కంపెనీ షేర్లను అటాచ్ చేయడంతో పాటుగా రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల పన్ను రిఫండ్‌ను నిలిపివేసిందని కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఆర్బిటేషన్ కోర్టు భారత్ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. పారిస్ నగరంలో ఉన్న, భారత ప్రభుత్వానికి చెందిన సుమారు 20 మిలియన్ యూరోల విలువైన ఫ్లాట్లు, తదితర ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కెయిర్న్ ఎనర్జీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చింది. కెయిర్న్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 11న ఫ్రెంచ్ కోర్టు ఆమోదించింది. దీనికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలు బుధవారం సాయంత్రానికి పూర్తయ్యాయని సమాచారం. కోర్టు ఆదేశాలతో ఈ ఆస్తులను భారత్ అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది.
ఏడేండ్ల నాటి వివాదం..
ఆర్థిక సంవత్సరం 2010-11లో కెయిర్న్ ఎనర్జీ తన భారత అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియాను వేదాంతకు విక్రయించింది. ఇంతక్రితం 2006లోనే కంపెనీ అంతర్గత పునర్ వ్యవస్థీకరణ సమాచారాన్ని తమకు ఇవ్వాలని ఐటీ శాఖ కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు ఇచ్చింది. ఆ వివరాలను పరిశీలించిన ఐటీ శాఖ పునర్వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కంపెనీని విక్రయించగా వేదాంతలో ఐదు శాతం ప్రాధాన్యత షేర్లను పొందింది. ఈ ప్రిపరేన్షియల్ షేర్లను కేంద్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. అదే విధంగా రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1590 కోట్ల ట్యాక్స్ రిఫండ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిర్ణయాలను కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేసింది. ముగ్గురు సభ్యులుగల ఈ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ బ్యునల్‌లో భారత ప్రభుత్వం నియమించిన ఒక న్యాయమూర్తి కూడా ఉన్నారు. గత కాలం నుంచి వర్తించే విధంగా పన్నులను విధించడాన్ని ఈ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ప్రభుత్వం అమ్మిన వాటాలు, జప్తు చేసిన డివిడెండ్, నిలిపివేసిన ట్యాక్స్ రిఫండ్స్‌ను తిరిగి కెయిర్న్‌కు ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. భారత్ 1.2 బిలియన్ డాలర్లు (8,972 కోట్లు) చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్తుల జప్తునకు అవకాశం కల్పించినట్టు సమాచారం.
ఈ వివాదానికి ముగింపు పలకడానికి భారత ప్రభుత్వంతో సామరస్య పరిష్కారానికే తాము ప్రాధాన్యమిస్తున్నామని కెయిర్న్ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక ప్రతిపాదనలను భారత ప్రభుత్వానికి సమర్పించామన్నారు. అయితే సరైన పరిష్కారం లభించకపోవడం వల్ల అంతర్జాతీయ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం తాము అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను తీసుకోవడం తప్పనిసరి అయ్యిందన్నారు.
ఆ సమాచారం అందలే..
కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రెంచ్ కోర్టు తీర్పు ఇచ్చినట్టు తమకు సమాచారం లేదని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పారిస్‌లోని ప్రభుత్వ ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ స్వాధీనం చేసుకుందని వార్తలు వస్తున్నాయని పేర్కొంది. కాగా దీనికి సంబంధించి భారత ప్రభుత్వానికి ఫ్రెంచ్ కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు, నోటీసు లేదా సమాచారం అందలేదని తెలిపింది. దీనికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటున్నామని..దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చట్టపరమైన పరిహార చర్యలను చేపడతామని పేర్కొంది.