Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదాంత ప్లాంట్‌ను వ్యతిరేకిస్తున్న గిరిజనం
- గుజరాత్‌లోని తాపి జిల్లాలో ఉద్రిక్తం ొ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జి
అహ్మదాబాద్ : అటు ఆరోగ్యపరంగా, ఇటు వ్యవసాయ భూముల సారాన్ని దెబ్బతీయడం ద్వారా జీవనోపాధిపరంగా తమ జీవితాలను నాశనం చేసే విధంగా ఉన్న పరిశ్రమ మాకొద్ద, ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని గుజరాత్‌లోని తాపి జిల్లాకు చెందిన దాదాపు 35 గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాపి జిల్లాలోని దోస్వాడి గ్రామంలో 300 కేటీపీఏ స్మెల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని వేదాంద గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ పేర్కొంది. 415 ఎకరాలకు పైగా నిర్మించతలపెట్టిన ఈ ప్లాంట్‌కు సంబంధించి గతేడాది అక్టోబర్‌లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి, కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. 25 ఏండ్ల క్రితం ఇండిస్టియల్ ఎస్టేట్ పేరుతో భూసేకరణ కింద సేకరించి ఇప్పటి వరకు వినియోగించని భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికను గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి(జీపీసీబీ) ఆలస్యంగా ప్రచురించడమే కాకుండా స్థానికులకు అర్థం కాకుండా ఉండేందుకు ఇంగ్లీష్‌లో ఇచ్చింది. అదేవిధంగా ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు కనీసం 45 రోజుల ముందు ప్రచురించాలన్న నిబంధనలను కూడా అధికారులు పాటించలేదు. జూన్ 20న నివేదికను ప్రచురించిన ఈనెల 5న అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ప్రజాభిప్రాయ సేకరణలో లాఠీచార్జి
సోమవారం నాడు చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. తాము చెప్పేది మాత్రమే వినాలని, ప్రశ్నలు అడగకూడదన్న ఉద్దేశంతో కలెక్టర్, ఇతర అధికారులు ఒక టెంట్ కింద కూర్చొని, ప్రజలను దూరంగా కూర్చొబ్టెట్టారు. అ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే స్థానికులను అనుమతించారు. తమను లోపలికి రానివ్వకడపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు వేల సంఖ్యలో సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ ప్రమేయం లేని అభిప్రాయ సేకరణను అనుమతించేది లేదని నినాదాలు చేశారు. స్థానిక నేతలు వచ్చి ప్రజలకు సర్ధిచెప్పేలోగా పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీలతో విరుచుకుపడ్డారని గుజరాత్‌కు చెందిన పర్యావరణవేత్త క్రిష్ణకాంత్ చౌహాన్ పేర్కొన్నారు. పైగా 200 మంది స్థానికులపై ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
రసాయనాల విడుదలపై ఆందోళన
వేదాంత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రభావిత గ్రామాల సర్పంచ్‌లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న స్థానికులు ప్లాంట్ నుంచి విడుదయ్యే రసాయనాల పట్ల ఆందోళన చెందుతున్నారని గిరిజన హక్కుల కార్యకర్త రోమేల్ సుతారియా అన్నారు. వేదాంత ప్రాజెక్టులపై అనేక స్థానిక గిరిజన యువత పరిశోధనలు చేసిందనీ.. తమిళనాడులోని ట్యూటికోరన్, రాజస్థాన్ ప్రాజెక్టుల ప్రభావాలపై వాస్తవాలు తెలుసుకున్నారని తెలిపారు. లెడ్, కాడ్మియం వంటి రసాయనాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీంతో పాటు వ్యవసాయ భూములపై చూపే ప్రభావం పట్ల ఆందోళన చెందుతున్నారన్నారు.