Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 శాతం పెరిగిన స్కూల్ ఫీజులు
- పట్టించుకోని ప్రభుత్వాలు..
- ఆందోళనలో తల్లిదండ్రులు : లోకల్ సర్కిల్ సర్వే
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఆన్లైన్ తరగతులు కోనసాగుతున్నప్పటికీ.. తమ పిల్లల పాఠశాల ఫీజులు పెరిగాయంటూ 63 శాతం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారని తాజాగా ఓ సర్వే పేర్కొంది. పాఠశాల ఫీజులకు సంబంధించి సోషల్ మీడియా కమ్యూనిటీ ప్లాట్ఫామ్ 'లోకల్ సర్కిల్' ఈ సర్వేను చేపట్టింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. ఆన్లైన్ తరగతుల కొనసాగుతున్నప్పటికీ తమ పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినట్టు 63 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఫీజులను పాఠశాలలు 20 శాతాని పైగా పెంచినట్టు 33 శాతం మంది వెల్లడించారు. 23 శాతం మంది ఫీజుల పెరుగుదల 10-20 శాతంగా ఉందని చెప్పారు. 10 శాతం ఫీజుల పెరుగుదల ఉందని 7 శాతం తల్లిదండ్రులు తెలిపారు. అయితే, 2020-21 నుంచి 10-20 శాతం ఫీజులు తగ్గినట్టు ఒక శాతం తల్లిదండ్రులు మాత్రమే చెప్పడం గమనార్హం. ఇదే కాలంలో 20 శాతానికి పైగా ఫీజులు తగ్గించినట్టు 2 శాతం మంది తెలిపారు. లోకల్ సర్కిల్ ఈ సర్వేను దేశంలోని 302 జిల్లాలో నిర్వహించింది. ఇందులో 26,000లకు పైగా ప్రతిస్పందనలు వచ్చాయి. టైర్1 ప్రాంతాల నుంచి 48 శాతం ప్రతిస్పందనలు, టైర్2 ప్రాంతాల నుంచి 28 శాతం, టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల నుంచి 24 శాతం ప్రతిస్పందనలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆన్లైన్ తరగతుల కారణంగా పాఠశాలల నిర్వహణకు సంబంధించి అనేక ఖర్చులు తగ్గుతాయి కాబట్టి స్కూల్ ఫీజులను పెంచవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించిన రెండు నెలల తర్వాత లోకల్ సర్కిల్ సర్వే ద్వారా ఈ విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.