Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రో.. గ్యాస్ ధరలపై భగ్గుమన్న ఆందోళనలు
- దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ
- ఎస్కేఎం పిలుపునకు భారీ స్పందన
- ఇంధన,గ్యాస్ రేట్లు సగానికి తగ్గించాలి: నేతల డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభించింది. దేశం అంతటా వేలాది ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటల పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులతో పాటు అనేక వర్గాల ప్రజలు నిరసనల్లో భాగస్వామ్యమయ్యారు. ఆందోళనకారులు తమ స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో సహా నిరసన కోసం ఎంపిక చేసిన రవాణా మార్గాలవద్దకు చేరుకొని ఆందోళనల్లో పాల్గొన్నారు. చాలాచోట్ల నిరసనకారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఉంచి, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ఆందోళనల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రదేశాల్లో రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తాడు కట్టి లాగుతూ తమ నినసనను వ్యక్తంచేశారు. హర్యానాలోని రోV్ాతక్లోనూ పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనల్లో రైతులతో పాటు కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, దుకాణదారులు, రవాణాదారులు, వ్యాపారులు ఇతరులు ప్రతిచోటా భాగస్వామ్యమయ్యారు. టిక్రీ, ఖాజీపూర్, సింఘూ, షాజహాన్‌పూర్ సరిహద్దుల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ధరలు సగానికి తగ్గించాలి: ఎస్కేఎం నేతలు
రైతులు సహా సాధారణ పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఇంధన ధరలను అన్యాయంగా, భరించలేని విధంగా పెంచడానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.100లను తాకిందని అన్నారు. ఈ ధర లీటరుకు విమాన ఇంధన ధర కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 2014లో డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను లీటరుకు రూ.3.56 నుంచి రూ.9.48 వరకు ఉండేదనీ, కాని ఇప్పుడు లీటరు డీజిల్‌కు రూ.31.80, పెట్రోల్‌కు రూ.32.90 వరకు పెరిగిందని విమర్శించారు. వంట గ్యాస్ ధరలు కూడా భరించలేని విధంగా పెరిగాయని అన్నారు. ఇటీవల గ్యాస్ సిలిండర్‌కు రూ.25 పెరిగిందనీ, ఇంధన ధరలు 62 సార్లు పెరిగాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను సగానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
224 రోజు కొనసాగిన రైతు ఉద్యమం
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అన్నదాతలు భారీగా కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం గురువారం నాటికి 224వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతున్నది.