Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కృష్ణా' గలాటపై ఆజ్యం
- ఏపీలో ఒకలా..తెలంగాణలో మరోలా
- రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే యోచన
- బండి సంజయ్, విష్ణువర్ధన్‌రెడ్డి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కృష్ణా నది జలాల వివాదంలో బీజేపీ అవకాశవాదం బట్టబయ లైంది. కేంద్రంలో అధికారంలో ఉండి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్క రించటానికి బదులు..తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వైఖరిని పరిష్కరించాలనే సోయి మరిచి అగ్గి మీద నూనె చల్లి మరింత పెద్దది చేసేలా వ్యవహరిస్తూ తన కపటనీతిని ప్రదర్శిస్తున్నది. అటు ఏపీలో విష్ణువర్ధన్‌రెడ్డి...ఇటు తెలంగాణలో బండిసంజరు తమ మాటలతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే కుట్రకు పూనుకున్నట్టు జరుగుతున్న పరిణామాలను చూస్తే స్పష్టమవుతున్నది. 'తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నది. ఆంధ్ర రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు. ఇది ఆంధ్ర రైతులకే కాదు...దేశ ప్రజలందరికీ అన్యాయం. ఆంధ్ర రైతులపై కడుపు మంటతో నీళ్ళను సముద్రంలోకి పంపుతున్నారు. దౌర్జన్యంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు' అంటూ ఏపీ ప్రజలను రెచ్చగొట్టేలా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
'కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశమిచ్చి కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆరే అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేసారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల కోసం కేసీఆర్ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారు. ఆంధ్రప్రదేశ్ విభన తర్వాత 2014లో 811 టీఎంసీల కృష్ణా జలాల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తాత్కాలిక ప్రాతిపాదికన వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రం కేవలం 299 టీఎంసీలు మాత్రమే వాడుకునీ, ఆంధ్ర ప్రదేశ్ కు 512 టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్ అంగీకరించి ఘోరతప్పిదం చేసి తెలంగాణ నోట్లో మట్టికొట్టారు. తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5 శాతముంది. దీని ప్రకారం తెలంగాణాకు 555 టీఎంసీల వాటా రావాలి. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతున్నా. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నది' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు అంటున్నారు.. కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశమివ్వడం ద్వారా కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఎక్కడ తలనొప్పిగా మారుతాయోనని తెలుగురాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాంతాలను బట్టి..రెండు నాల్కలధోరణిని అనుసరించటం కాషాయపార్టీకి కామనే నని రాజకీయపరిశీలకులు అంటున్నారు.