Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ను పర్యవేక్షించే పేరుతో ప్రస్తుతం ప్రధాన స్రవంతి మీడియా కంటే విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న డిజిటల్ మీడియాను నియంత్రించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ది హిందూ గ్రూప్ డైరెక్టర్, మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ అన్నారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనాస్వేచ్ఛ ప్రమాదంలో ఉందా?' అనే అంశంపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి చెందిన జర్నలిస్టు స్టీఫెన్ సక్కూర్ నిర్వహించిన హార్డ్‌టాక్ కార్యక్రమంలో రామ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. నకిలీ వార్తల నిరంతర వ్యాప్తిని డీల్ చేసేందుకు యంత్రాంగాలు అవసరమని ఐటీ రూల్స్-2021ను ప్రకటించే సమయంలో అప్పటి కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ చెప్పారని అన్నారు. నకిలీ వార్తలను ప్రభుత్వం అతిశయోక్తి చేసి చూపుతోందని, ఇటువంటి వార్తల వల్ల ఇప్పటి వరకు భారత్‌కు ఎటువంటి నష్టం జరగలేదని అన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిన సందర్భాలు ఉండొచ్చు, కానీ దాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయని రామ్ పేర్కొన్నారు. డిజిటల్ మీడియాపై కొత్త ఐటీ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని అన్నారు. చాలా వార్తాపత్రికలు డిజిటల్ రూపం కలిగివున్నాయనీ, పెద్దమొత్తంలో ప్రింట్ మెటీరియల్ డిజిటల్ రూపం పొందిందనీ, ఈ నేపథ్యంలో ఒకే కంటెంట్ కోసం రెండు సెట్ల నియమాలు ఉంటాయా? అని ప్రశ్నించారు. కోవిడ్-19కు సంబంధించి భారతీయ మీడియా కవరేజ్ గురించి అడిగిన ప్రశ్నకు రామ్ స్పందిస్తూ.. కరోనా వైరస్ మహమ్మారి భారతీయ జర్నలిజం పరిమితులను బహిర్గతం చేసిందన్నారు. అమెరికాలో మరణాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను న్యూయార్క్‌టైమ్స్ బహిర్గతం చేసిందని, భారత్‌లో మాత్రం మీడియా సరిగ్గా ఆ పని చేయలేకపోయిందని పేర్కొన్నారు.