Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సభ్యులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తామనీ, ప్రస్తుతం 83 మంది సభ్యులున్న అసెంబ్లీలో అదనంగా మరో ఏడు స్థానాలను కేటాయిస్తామని జమ్ముకాశ్మీర్ పునర్విభజన కమిషన్ శుక్రవారం ప్రకటించింది. కమిషన్ నాలుగు రోజుల పర్యటన శుక్రవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, ఎలక్షన్ కమిషన్ చీఫ్ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక నిర్దిష్ట ప్రాంతం లోని ప్రజల రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పునర్విభజన ప్రక్రియ ఉండాలని అన్నారు. పునర్విభజన కోసం జనాభాను మాత్రమే కాకుండా నియోజకవర్గాల భౌగోళిక అనుకూలతలు తదితర అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్ముకాశ్మీర్‌కు కేటాయించిన 24 స్థానాలకు ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ లకు ఎన్ని స్థానాలను రిజర్వు చేయాలో కమిషన్ స్పష్టంగా వెల్లడిస్తుందనీ, జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు. సుమారు 290 సంఘాలతో కమిషన్ చర్చలు జరిపినట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఈ అసెంబ్లీలో ఎస్సిలకు ఇప్పటికే ఏడు స్థానాలు రిజర్వ్ చేసి ఉన్నాయి.