Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో సవాళ్ల పిటిషన్లను బదిలీ చేయాలన్న అభ్యర్థన తిరస్కరణ
- ఎన్బీఏకు అనుకూలంగా కేరళ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం అటు సుప్రీంకోర్టు, ఇటు కేరళ హైకోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త ఐటీ రూల్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై స్టే విధించాలన్న మోడీ సర్కార్‌ను అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అన్ని హై కోర్టులో ఒకేరకమైన పిటిషన్ల ఉన్నందున వాటన్నింటినీ ఇక్కడకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన ఎఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం, కేంద్రం పిటిషన్‌ను కోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్ పిల్‌తో ట్యాగ్ చేసింది. మరోవైపు కొత్త ఐటీ రూల్స్‌ను సవాల్ చేసిన న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు అనుకూలంగా కేరళ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్బీఏలో భాగంగా ఉన్న వార్తాసంస్థలకు వ్యతిరేకంగా ఈ రూల్స్ ప్రకారం ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఐటీ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ మేరకు జస్టిస్ పిబి సురేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
కొత్త ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కేరళ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఆయా కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇటువంటి కేసులపై విచారణ జరుగుతోందని, ఈ నేపథ్యంలో హైకోర్టుల్లో పిటిషన్లను బదిలీ చేయాలన్న కేంద్రం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను ఎఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. దీనిపై ఆదేశాలు ఇవ్వలేమని, ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో పిటిషన్‌తో ట్యాగ్ చేసి ఈనెల 16న మరో బెంచ్ ముందుకు లిస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఒకేరకమైన హైకోర్టుల్లో స్వతంత్రంగా విచారణలు జరిగితే, అది హైకోర్టులు, సుప్రీంకోర్టుల నిర్ణయాల మధ్య సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందని, కొత్త నిబంధనల వివరాలు ఇప్పటికే సుప్రీంకోర్టు ముందున్నాయని కేంద్రం పేర్కొంది.
ఐటి చట్టానికి అతీతంగా..
కొత్త ఐటీ రూల్స్ ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను పరిమితం చేస్తూ మీడియాపై అసమంజసంగా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు లభిస్తాయని ఎన్బీఏ తన పిటిషన్ ద్వారా కేరళ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఎన్బీఏ తరపు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ, ఐటీ రూల్స్-2021 ఐటీ చట్టానికి అతీతంగా, అధికార పరిధికి మించి ఉన్నట్లు తెలిపారు. మూడంచెల పర్యవేక్షక యంత్రాంగం ఏర్పాటుకు అవకాశం కల్పించడాన్ని కూడా ప్రశ్నించారు. న్యాయాధికారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదని పేర్కొంటూ ప్రభుత్వ నిర్బంధ చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ డిజిటల్ మీడియా సంస్థలకు అనుకూలంగా గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదిలావుండగా, సామాన్యులను సాధికారత కల్పించడానికే కొత్త ఐటీ రూల్స్‌ను తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వినియోగదారులను బలవంతం చేయం : వాట్సాప్
డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చే వరకు కొత్త గోప్యతా విధానం అమలును స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త విధానాన్ని అంగీకరించమని వినియోగదారులను బలవంతం చేయమని, ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లకు అందజేసే సేవల్లో ఎటువంటి పరిమితులు విధించబోమని వాట్సాప్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అయితే యూజర్లకు అప్డేట్ను డిస్ప్లే చేయడం కొనసాగిస్తామన్నారు.