Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎఫ్‌కు బడ్జెట్ కేటాయింపులేవి?
- తప్పుదారి పట్టించేలా కేంద్ర ప్రకటన : సంయుక్త కిసాన్ మోర్చా విమర్శ
న్యూఢిల్లీ : నిరంతరం అబద్ధాలు, తప్పుడు వాదనలతో రోజులు గడుపుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-ఏఐఎఫ్) నుంచి మండీలకు రుణసదుపాయం పేరుతో ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.లక్ష కోట్ల ఏఐఎఫ్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లకు రుణ సదుపాయం కల్పిస్తామనీ, ఈ లక్ష కోట్ల నిధిని మండీలు వినియోగించుకోనున్నాయని చెబుతున్న మాటలు వట్టి బూటకమని పేర్కొంది. ఈ మేరకు ఎస్కేఎం నేతలు దర్శన్పాల్, హన్నన్‌మొల్లా, బల్బీర్‌సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్ చారుని, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్, శివకుమార్ శర్మ, యుద్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''రూ.లక్ష కోట్ల అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రర్ ఫండ్' ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని, ఇప్పటి వరకు ఈ ఫండ్‌కు ప్రభుత్వం రూ.వెయ్యి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకే ఈ పథకం కొత్తగా అవకాశం కల్పించిందని అన్నారు. 2020-21 సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఏఐఎఫ్‌కు రూ.208 కోట్లు మాత్రమే కేటాయించగా, 2021-22 బడ్జెట్లో అది రూ.900 కోట్లుగా ఉంది. రుణాల విషయంలో పరిశీలించినా, ఈ ఏడాది మార్చి నాటికి ఎఐఎఫ్ నుంచి రూ.3,241 కోట్లు (తదుపరి మీడియా నివేదికల ఆధారంగా రూ.4,300 కోట్లు) మాత్రమే రుణాలు మంజూరయ్యాయని ఎస్‌కెఎం వివరించింది. మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ.. ఏపీఎంసీ మార్కెట్ల లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను నాశనం చేసిందని, ఇప్పుడు ఏపీఎంసీలను రుణాల పొందేందుకు అనుమతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. చిన్న రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ మార్కెట్లు, నిల్వ మౌలిక సదుపాయాలు నిర్మించడంలో, విస్తరించడంలో ఎటువంటి నిబద్ధత చూపని కేంద్ర ప్రభుత్వం.. ప్రయివేటు మార్కెట్లు, స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ సదుపాయాలను నిర్మించేందుకు అదానీ, వాల్‌మార్ట్, రిలయన్స్ కంపెనీలకు అవకాశాలను సులభతరం చేసిందని విమర్శించింది. కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకురావడానికి ముందుగానే ఈ అగ్రికల్చర్ ఫండ్ ప్రకటన వచ్చిందని తెలిపింది. వ్యవసాయ చట్టాల చుట్టూ అల్లుతున్న అబద్ధాల పూతను ఆపి, ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఎస్‌కెఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.