Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల వ్యవస్థకు ప్రమాదం పొంచివుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వెల్లువలా వస్తున్న తప్పుడు సమాచారం, వక్రీకరణలు ఎన్నికల వ్యవస్థను ప్రమాదంలో నెడుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమాచార యుగంలో అందుబాటులోకి వచ్చిన వ్యవస్థలు(ఫేస్బుక్, ట్విట్టర్..మొదలైనవి) సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని, ఈ వేదికలపై స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తమవుతాయా? అనేది సందేహాన్ని కలిగిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పౌరులకు సరైన సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తాయని న్యాయస్థానం తెలిపింది. ధనబలం, రాజకీయ పలుకుబడి కలిగిన బడా కార్పొరేట్ సంస్థలు ఈ సోషల్ మీడియా కంపెనీలను నడుపుతున్నాయని, ఫేస్బుక్ వంటి వేదికలపై వెలువడుతున్న సమాచారం దేశాల సరిహద్దులు దాటి ఎంతోమందిని ప్రభావితం చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు సంబంధించి ఏర్పాటైన 'ఢిల్లీ అసెంబ్లీ శాంతిసామరస్యాల' కమిటీ ఫేస్బుక్కు సమన్లు జారీచేసింది. అల్లర్లపై ఒక సాక్షిగా తమ ముందు హాజరుకావాలని కమిటీ ఆదేశాలు జారీచేయగా.. ఫేస్బుక్ పాటించలేదు. సమన్లను సవాల్ చేస్తూ ఫేస్బుక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరుపుతూ జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. పిటిషన్లో ఫేస్బుక్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. డిజిటల్ వేదికల్లో ఒకటైన ఫేస్బుక్కు భారీ సంఖ్యలో ఖాతాదార్లు ఉన్నారని, ఈ నేపథ్యంలో సంస్థ బాధ్యాతాయుతంగా వ్యవహరిం చాలని ధర్మాసనం పేర్కొన్నది. వక్రీకరణలతో కూడిన తప్పుడు సమాచారం ఎన్నికల సంఘం వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.