Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకుంటున్నా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే :
- ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ సమీక్ష
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశంలో అధిక ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. గ్లోబల్ డిమాండ్‌తో కమోడిటీ ధరలు, ముడి సరుకుల వ్యయాలు పెరగడం ఇబ్బందికరమేనని ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) తన జూన్ సమీక్షలో విశ్లేషించింది. గత మేలో చోటు చేసుకున్న ద్రవ్యోల్బణం గణంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది. టోకు ధరల సూచీ ఏకంగా 6.3 శాతానికి చేరగా.. వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 12.94 శాతానికి ఎగబాకడం ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందని తెలిపింది. సరఫరా చెయిన్‌లో నెలకొన్న సమస్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయని వెల్లడించింది. ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రిత్వ శాఖనే స్వయంగా ఆందోళన వ్యక్తం చేస్తుందంటే ధరల పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయే స్పష్టం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.100 దాటడంతో ఇంధన ధరలు మండుతున్నాయని డీఈఏ పేర్కొంది. దీంతో ఇంధన ధరల నెపాన్ని రాష్ట్రాలపై నెట్టేసినట్లయ్యింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం, ఖరీఫ్ సాగు క్రమంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో ధరలు తగ్గొచ్చని పేర్కొంది. అన్‌లాక్ ప్రక్రియ వేగవంతం కావడం కూడా ద్రవ్యోల్బణం తగ్గుదలకు దోహదం చేయొచ్చని డిఇఎ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగించడం, ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుదల వంటి సవాళ్లను ఆర్థిక వ్యవస్థ అధిగమించాల్సి ఉందని ఈ రిపోర్ట్‌లో పేర్కొంది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఎరువుల సబ్సిడీ పెంపు వంటి చర్యలతో రాబోయే త్రైమాసికాల్లో గ్రామీణ డిమాండ్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో జీఎస్టీ ఈ-వే బిల్లులు, విద్యుత్ వినియోగం, వాహన రిజిస్ట్రేషన్లు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పునర్జీవానికి సంకేతమని తెలిపింది.