Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు
ఓ వైపు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం. మరోవైపు పర్యావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి. పర్యవసానంగా.. ప్రపంచవ్యాప్తంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని 'ఆక్స్ఫామ్' నివేదిక వెల్లడించింది. ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు నమోదవుతున్నాయి. అయినా కూడా యుద్ధాలు, అంతర్యుద్ధాల కోసం పాలకులు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ..ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.3.8లక్షల కోట్లు) పెరిగిందని నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ : ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అయితే కరోనాను మించిన అత్యంత ప్రమాదకరమైన సమస్య..'ఆకలి' మానవాళిని వేధిస్తోంది. కరోనా, ఆర్థిక సంక్షోభం, అంతర్గత యుద్ధాలు..ఇవన్నీ ఆకలి చావులు పెరగడానికి దారితీసిందని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న 'ఆక్స్ఫామ్' సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అనేక దేశాల్లో కరువు కరాళనృత్యం చేస్తూ నిత్యం ఎంతోమందిని బలితీసుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం, ఆకలి చావులపై ఈ సంస్థ '' ద హంగర్ వైరస్ మల్టీపైల్స్ '' పేరుతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం 15.5 కోట్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్ఫామ్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2 కోట్లు పెరిగిందని హెచ్చరించింది. ఇందులో రెండొంతుల మంది తమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణల కారణంగా ఆకలితో అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కంటే కరువు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, కోవిడ్ కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు మరణిస్తుంటే, ఆకలి ప్రతి నిమిషానికి 11మందిని పొట్టనబెట్టుకుంటోందని పేర్కొంది.
శాపంగా మారిన అంతర్గత యుద్ధాలు
ఇప్పటికే ప్రకృతి విపత్తులు, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ మంతా కొట్టుమిట్టాడుతుంటే..కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు అక్కడి ప్రజ లకు శాపంగా మారుతున్నాయని ఆక్స్ఫామ్ సీఈఓ అబే మాక్సమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ..ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.3.80 లక్షల కోట్లు) పెరిగింది. ఆహార కొరత, పేదరిక నిర్మూలన ఆపేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దానికంటే ఇది ఆరు రేట్లు ఎక్కువని ఆక్స్ఫామ్ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది. కొన్ని దేశాల్లో ఈ ఆకలి ఆయుధంగా మారుతోందని పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ఈ అంతర్గత యుద్ధాలను ఆపాలని, అప్పుడే ఆకలి చావులను అరికట్టగలమని ఆక్స్ఫామ్ అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉండగా..గ్లోబల్ వార్మింగ్, ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా గత దశాబ్దకాలంలో ఆహార పదార్థాల ధరలు 40శాతం వరకు పెరిగాయి. ఇది కూడా అనేకమంది ఆకలి సమస్యలకు ఓ కారణమవుతోందని నివేదిక తెలిపింది.
- ఆకలితో అలమటిస్తున్న 15.5కోట్లమంది : ఆక్స్ఫామ్
- కరోనా సమయంలో పెరిగిన మిలిటరీ ఖర్చు రూ.3.8లక్షల కోట్లు
- లాక్డౌన్లతో ఆహార పదార్థాల ధరలు పైపైకి..
కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ల వల్ల ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40శాతం వరకు పెరిగాయని నివేదిక తెలిపింది. కరోనా, లాక్డౌన్లు, ఆర్థిక సంక్షోభానికి యుద్ధవాతావరణం తోడు కావడంతో సుమారు 5.2లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారు. చాలా దేశాలు తమ ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ బలగాల పటిష్టత కోసం భారీగా ఖర్చు చేశాయి. అఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియాచ, యెమెన్ వంటి దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది.