Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోమ్ సహాయమంత్రి నిశిత్ ప్రామాణిక్ విద్యార్హతలపై వివాదం
న్యూఢిల్లీ : విద్యార్హతల విషయమై..కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రామాణిక్ వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభ ఎన్నికల(మార్చి, 2019లో) సమయాన సమర్పించిన అఫిడవిట్లో ఆయన విద్యార్హత 'మాధ్యమిక్ పరీక్ష' (10వ తరగతి కన్నా తక్కువ) అని పేర్కొనగా, తాజాగా మంత్రి పదవి పొందాక లోక్‌సభ వెబ్సైట్లో డిగ్రీ (బీసీఏ) పూర్తిచేసినట్టుగా తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న నిశిత్ ప్రామాణిక్ విరుద్ధమైన సమాచారాన్ని తెలిపారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కుచ్‌బిహార్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నిశిత్ ప్రామాణిక్, ఈమధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. టీఎంసీ అభ్యర్థిపై 57ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకుండా, ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లోనూ తన విద్యార్హత 'మాద్యమిక్ పరీక్ష'గా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అయ్యాక లోక్‌సభ వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్‌లో 'బీసీఏ' పూర్తిచేసినట్టుగా చూపారు. తన విదార్హతల విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడని నిశిత్ ప్రామాణిక్‌పై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. '' ఇంటర్ పాసయ్యాడా? లేదా? అన్నదే స్పష్టత లేదు. అలాంటిది ఆయన డిగ్రీ పూర్తిచేసినట్టు లోక్‌సభ వెబ్సైట్లో చూపారు. ఇదెలా సాధ్యం?'' అని టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఉదయన్ గుహ ప్రశ్నించారు. ఈ వివాదంపై మీడియా వర్గాలు నిశిత్ ప్రామాణిక్‌ను సంప్రదించగా, ఆయన స్పందించలేదు. కుచ్‌బిహార్ జిల్లా టీఎంసీ యూత్వింగ్ నాయకుడిగా ఉన్న నిశిత్ 2018లో బీజేపీలో చేరారు.