Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. స్పెషల్ పోలీసులు 350 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లోని చాలా ప్రాంతాలతో సంబంధం కలిగిన ఈ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో హర్యానాకు చెందిన వారు ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఈ కేసులో నార్కో-టెర్రరిజం కోణాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్ రాకెట్ భారత్, పాక్, ఆప్ఘన్ సహా ఈయూ దేశాలతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. కాగా, ఈ నెల 7న రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో పాక్ నుంచి తరలిస్తున్న 22 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ నుంచి డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసినట్టు వెల్లడించిన నిందితున్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) అరెస్టు చేశాయి. అదే రోజు రూ.7.36 కోట్ల విలువైన హెరాయిన్‌ను రవాణా చేసేందుకు యత్నించిన జాంబియాకు చెందిన ఇద్దరిని సైతం ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.