Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు అందని జూన్ వేతనాలు
- 28న నిరాహార దీక్ష !
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ విధానాలు, ఉద్దేశపూర్వక చర్యలు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. వాలంటరీ రిటైర్మెంట్ పథకం వల్ల బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది కొరత తీవ్రరూపం దాల్చిందని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వటం ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల జీతాలు జులై 10దాటినా ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంస్థ ఆర్థిక అంశాలపై ఎలాంటి సమీక్షలూ చేయకుండా, మోడీ సర్కార్ ఏకపక్షంగా చర్యలు చేపడుతోందని, గత రెండు మూడు సంవత్సరాలుగా కేంద్రం అమలుజేస్తున్న విధానాలు సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 28న సిబ్బంది అంతా నిరాహార దీక్ష చేపడుతున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీనిపై బీఎస్ఎన్ఎల్ఈయూ ప్రధాన కార్యదర్శి అభిమన్యు మాట్లాడుతూ, మార్చి 2019 నుంచి సిబ్బందికి వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నారని, తద్వారా సిబ్బందిని బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్వైపు వెళ్లేట్టు చేశారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే బీఎస్ఎన్ఎల్ ఈ స్థితికి చేరుకుందని ఆయన విమర్శించారు. బీఎస్ఎన్ఎల్కు 4జీ సెక్ట్రమ్ కేటాయించకుండా ఇతర ప్రయివేటు కంపెనీలతో ఎలా పోటీపడుతుందని ఆయన ప్రశ్నించారు? సంస్థ ముందుకు వెళ్లకుండా మోడీ సర్కార్ అనేక అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఈనెల 28న సిబ్బంది అంతా నిరాహార దీక్ష చేపడుతున్నామని చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.