Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఘటన
- కులంపేరు అడిగిమరీ చితకబాదారు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏండ్ల దళిత యువకుడిని కొంత మంది అత్యంత కిరాతకంగా చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని అక్బర్పూర్లో ఈ అనాగరిక చర్య చోటుచేసుకుంది. అందులో బాధితుడి జుట్టు పట్టుకుని మరీ తంతూ, కర్రలతో కొడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. కాగా, అతని కులం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత మరింత తీవ్రంగా కొట్టినట్టు వీడియోలో కనిపిస్తోంది. దెబ్బలకు తట్టుకోలేక ఆ యువకుడు కేకలు వేసినప్పటికీ.. కనికరం లేకుండా చితకబాదారు. మరో వీడియోలో అతని చేతులు కట్టి.. కర్రతో ప్రయివేటు భాగాల్లో ఇష్టానుసారంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియో గురించి తెలియగానే, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఘన్శ్యామ్ చౌరాశియా చెప్పారు. ఒకరిని అరెస్టు చేశామనీ, మరో ఇద్దరు కోసం వెతుకుతున్నామని చెప్పారు.