Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడులకు మేం అనుకూలం..
- నిటి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి సూచిలో మొదటి స్థానంలో ఉన్నాం : సీఎం
తిరువనంతపురం: స్నేహపూర్వక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న కేరళ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం జరుగుతున్నదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అన్నారు. రాజకీయ పరంగా కక్షపూరితంగా కేరళ పెట్టుబడులకు అనుకూలం కాదనే ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇటీవల ఎల్డీఎఫ్ ప్రభుత్వ రాజకీయ వేధింపులను ఉటంకిస్తూ.. కిటెక్స్ సంస్థ కేరళ నుంచి తెలంగాణకు తన పెట్టుబడులను మార్చడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పినరయి విజయన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న కేరళ ఇమేజ్‌పై బురదజల్లే ఏ విధమైన చర్య అయిన అది ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు వ్యతిరేకమని విజయన్ అన్నారు. కేరళపై గతంలోనూ ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారనీ, భవిష్యత్తులోనూ అదే చేస్తారని వెల్లడించారు. కేరళ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్ర్రమని నిటి ఆయోగ్ సైతం పేర్కొందనీ, ఇటీవల విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి సూచిలో కేరళ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సృజనాత్మకత, పెట్టుబడి అనుకూల వాతావరణం, మానవ వనరులలో కేరళ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్న నిటి ఆయోగ్ రిపోర్టును గుర్తు చేశారు. అలాగే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్.. రాజకీయ స్థిరత్వం, వ్యాపార అవగాహన పరంగా కేరళ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. గత ఐదేండ్లలో పెట్టుబడులు సైతం భారీగానే వచ్చాయి. కరోనా సంక్షోభంలో ఎంఎస్ఎంఈ రంగ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1416 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్రంలో 70,946 ఎంఎస్ఎంఈలు దుకాణాలను ఏర్పాటు చేశారు. కోచ్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ భూ సేకరణ తుదిదశకు చేరింది. ఇంకా అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ బోర్డును సైతం ఏర్పాటు చేసింది.