Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం మార్గదర్శకాలు బుట్టదాఖలుచేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా, లాక్డౌన్ల దెబ్బకు వలస కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రమూ సరిపోవని రాజకీయ వర్గాలు, సామాజికవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని ఆదుకోవటంలో కేంద్రం ఎలాంటి చొరవా తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు కూడా కొద్ది రోజుల క్రితం (జూన్ 29న) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వీలైనంత ఎక్కువమందిని తీసుకురావాలని సూచించినా, కేంద్రం పట్టించుకోక పోవటం చర్చనీయాంశమైంది. రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించటంతో సాంకేతిక సమస్యలు, ఇతర నగరాలకు వలస వెళ్లినచోట రేషన్ సరుకులు పొందే సౌలభ్యం లేకపోవటం కోట్లాదిమంది వలస కార్మికులను ఇక్కట్లకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈ సంక్షోభ సమయాన కోట్లాదిమంది పేదలకు ఆహార భద్రతను దూరం చేస్తోందని ఆరోపణలున్నాయి. విధానపరమైన లోపాల్ని వెంటనే సరిదిద్దాలని సుప్రీం స్పష్టంగా సూచించింది. అలాగే వలస కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని సుప్రీం సూచించినా, కేంద్రం పెడచెవిన పెట్టింది. దాంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు రేషన్ సరుకులు పొందలేకపోయారు. కరోనా రెండో వేవ్ ఉధృతమైన సమయంలో వలస కార్మికులను ఆదుకోవటంపై కేంద్రం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అత్యంత ముఖ్యమైన ఏడు మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీరు క్షమించరానిదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేషన్ కార్డులు లేని వలస కార్మికులు కోట్లల్లో ఉన్నారని, ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలుజేయాలన్నది సుప్రీంకోర్టు చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైంది. ప్రస్తుత దేశ జనాభా 135కోట్లలో కేవలం 80కోట్లమందికి మాత్రమే వర్తిస్తోందని, మరో 10కోట్లమంది పేదలకు ఆహార భద్రత చట్టం అమలుకావటం లేదని సుప్రీం అభిప్రాయపడింది.