Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సినేషన్లో జాప్యం,
- ప్రోటోకాల్ ఉల్లంఘనలపై వైద్యుల హెచ్చరిక
న్యూఢిల్లీ: మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘనల వల్ల కోవిడ్-19 ముప్పు మళ్లీ ముంచుకొంచే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న కరోనా రెండో దశ ప్రభావంతోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సిన్‌లో జాప్యం వల్ల డెల్టా ప్లస్ వేరియంట్లు విజృంభించే ప్రమాదం ఉందన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరం మరింతగా ఉందన్నారు. ఎయిర్ కండిషన్ ఉన్న ప్రాంతాలు, వెంటిలేషన్ పెద్దగా లేని ప్రాంతాలు సూపర్ స్ప్రెడర్ జోన్లుగా మారకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
వేడి, తేమతో కూడిన అధ్వానమైన వాతావరణ పరిస్థితుల వల్ల కరోనా వేరియంట్లు తీవ్రతరమయ్యే అవకాశముందని ఫరీదాబాద్‌లోని క్యూఆర్‌జి హెల్త్‌సిటీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ ఇంటర్నెల్ మెడిసిన్ అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిగా పడితే ఈ వైరస్ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదని అన్నారు. అందుకే అందరికీ వ్యాక్సిన్ సత్వరమే అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. అలాగే ప్రజలు కూడా శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రాంతాలకు దూరంగా ఉండడం, వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రస్తుత వాతావరణం వడదెబ్బ, అలసట, టైఫాయిడ్, కామెర్లు, మలేరియా వంటి వ్యాధులతోపాటు ఇతర సమస్యలకు దారితీస్తుందని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ సురన్‌జిత్ ఛటర్జీ తెలిపారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా పాడినప్పుడు జీవంతో ఉన్న వైరస్‌లను కలిగివున్న చిన్నపాటి నీటి బిందువులు, నీటి కణాలు (ఏరోసోల్స్) గాలిలో వ్యాప్తి చెందేందుకు వాతావరణంలోని తక్కువ సాంద్రత దోహదం చేస్తుందని మూల్‌చంద్ హాస్పిటల్‌కు చెందిన పల్మొనాలజీ కన్సల్టెంట్ భగవాన్ మంత్రి వివరించారు.
కరోనా వైరస్ కలిగివున్న ఏరోసోల్స్ ఊపిరితిత్తుల్లోకి మరింతగా చొచ్చుకుపోతాయని అన్నారు. తేమస్థాయి తగినంతగా లేని సమయంలో వైరల్ కణాలు ఎక్కువ డాకింగ్ సామర్ధ్యాన్ని కలిగివుండి, సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఏదేమైనా వాతావరణ పరిస్థితుల నుంచి ఎదురయ్యే ఏ ప్రమాదాన్నైనా నివారించేందుకు కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని భగవాన్ అభిప్రాయపడ్డారు.