Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ ఖర్చులు అధికం కావాలి
- వ్యాక్సినేషన్ వేగం పెరగాలి : ఏచూరి
న్యూఢిల్లీ: ఉద్యోగాలు, డిమాండ్‌ను సృష్టించే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రధాని మోడీ సర్కారు ఎక్కువ ఖర్చులు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మౌలిక సదుపాయాల వ్యయం గణనీయంగా పడిపోవడం మరియు వ్యాక్సినేషన్ రేట్లు తగ్గడం వంటి వార్తల నేపథ్యంలో ఏచూరి ప్రభుత్వ తీరుపై వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు. ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కువ లేకపోతే 'భారీ మంత్రివర్గం'తో ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ''ముఖాల మార్పు, భారీ క్యాబినెట్‌తో ఉపయోగం లేదు : థ్యాంక్స్ యాడ్ జిమ్మిక్కులను ఆపండి. వ్యాక్సిన్ల కోసం కేటాయించిన డబ్బును ఖర్చు చేయండి'' అని ట్వీట్ చేశారు. ప్రభుత్వ కేటాయింపులు సైతం ఎక్కడ ఖర్చు చేశారో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ''జాతీయ ఆస్తుల దోపిడీ, భయంకరమైన పెట్రోల్ ధరల పెంపు ఎక్సైజ్ నుంచి వచ్చిన డబ్బు ఎక్కడుంది? మోడీ ప్రభుత్వ పీఆర్ ప్రచారానికా? లేదా ప్రధాని కొత్త ఇంటిని నిర్మించి లగ్జరీ విమానాలను కొనుగోలు చేయాలా? ప్రపంచం ఉద్యోగాల కోసం ఖర్చు చేస్తోంది. ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించడానికి సహాయం చేస్తోంది. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు'' అంటూ ట్వీట్ చేశారు.కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్నదనీ.. దానిని బారినుంచి ప్రజలను రక్షించడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం టీకాలని ఏచూరి పేర్కొన్నారు. ''ప్రభుత్వం ప్రజలందరికీ టీకాలు అందించడానికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ప్రాణం ఎంతో విలువైనది'' అంటూ ట్వీట్ చేశారు. దీనికి వ్యాక్సిన్లు తక్కువగా ప్రజలకు అందించిన దేశాల జాబితాలో భారత్ ఉందంటూ పేర్కొన్న నివేదికను జత చేశారు.