Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి తప్పనితిప్పలు..
- కరోనాతో పరిస్థితి మరింత దారుణం.. : పలు సర్వేల్లో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా యావత్ ప్రజానీక జీవన పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. మరీ ముఖ్యంగా కరోనా ఆరోగ్య సంక్షోభంతో సీనియర్ సిటిజన్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరోనా బారినపడ్డ వృద్ధుల సంఖ్య సైతం అధికంగానే ఉంది. లాక్డౌన్ విధింపు.. దాని పొడిగింపు కారణంగా వృద్ధుల రెగ్యులర్ హెల్త్ చెక్-అప్లు లేకపోవడంతో వారి ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. ఇంటికే పరిమితం కావడం, శారీరక శ్రమ లేకపోవడంతో ఆకలి లేకపోవడం, నిద్రలేమి, ఆందోళన వంటి ఇతర అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక వేధింపులు పెరుతున్నాయి. ఒంటరితనానికి గురిచేయడం, అగౌరవపర్చడం, వారి కనీస అవసరాలకు డబ్బును ఇవ్వకపోవడం, బలవంతంగా పని చేయించడం, వారి వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. వృద్ధుల హక్కుల కోసం పనిచేస్తున్న హెల్ప్ ఏజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. ఈ ఏడాది 62 శాతం మంది వేధింపులకు గురవుతున్నారు. వృద్థ్యాప్య గృహాల్లో ఉన్న 36 శాతం మంది సమాజంతో వేధింపులకు గురవుతున్నట్టు భావిస్తున్నారు. అలాగే, ఏజ్ వెల్ ఇండియా జరిపిన అధ్యయనంలో 58 శాతం మంది వృద్ధులు తమ కుటుంబాలచే వేధింపులకు గురవుతున్నారని గుర్తించింది. బెంగుళూరు పోలీసులు, నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎల్డర్స్ హెల్ప్‌లైన్ (1090)కు ఏప్రిల్ 2020-మే 2021 వరకు 2,087 ఫిర్యాదులు అందగా, అందులో 43 శాతం వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో వృద్ధులను సరిగ్గా చూసుకోకపోవడం (మిస్ట్రీట్మెంట్) సంబంధించిన కేసులు 71.8 శాతం పెరిగినట్టు హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే పేర్కొంది.
మహమ్మారి ముందునుంచే..
దేశంలో మహమ్మారికి ముందునుంచే వృద్ధులపై వేధింపులు అధికంగా ఉన్నాయి. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీసింది. 2018లో హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే చేసిన 5,014 మందిలో 25 శాతం మంది ఏదో ఒక రూపంలో వేధింపులకు గురయ్యారు. 82 శాతం మంది తమ కుటుంబ గౌరవాన్ని కాపడటం, సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియకపోవడం వంటి కారణాలతో వేధింపుల గురించి చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక వృద్ధుడు వేధింపులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా సమయంలో వృద్ధులపై వేధింపులకు పాల్పడుతున్న వారిలో అధికంగా కుమారులు (43.8 శాతం) ఉండగా, ఆ తర్వాత కోడళ్లు (27.8 శాతం), కుమార్తెలు (14.2 శాతం) ఉన్నారని హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే పేర్కొంది. 60 శాతం మంది వృద్ధులు మానసిక, ఆర్థిక వేధింపులు, 58.6 శాతం మంది శారీరక వేధింపులు ఎదుర్కొన్నారు.