Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నిర్బంధిస్తున్నారు
- మీడియాపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు: ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ : ఈ దేశంలో వాక్ స్వాతంత్య్రానికి పూర్తిగా సంకెళ్లు వేస్తున్నారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై పోలీసు కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల జైల్లో కన్నుమూసిన ఆదివాసీల గొంతుక, హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామీని గుర్తుచేసుకుంటూ ప్రశాంత్ భూషణ్ పై వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..''పౌరులందరికీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిపై 'అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్'(యూఏపీఏ) చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఒక్కసారి ఈ కేసులో ఇరుక్కుంటే నిందితుడికి బెయిల్ రావటం కష్ట''మని అన్నారు. గతకొన్నాండ్లుగా పౌర హక్కుల్ని కాపాడటంలో న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుపై ప్రశాంత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య వివాదం, జడ్జి లోయా మృతి, రాఫెల్ డీల్, బిర్లా-సహారా, ఆర్టికల్ 370 రద్దు...మొదలైన కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం పట్ల ప్రజల్లో నమ్మకం సడలుతోందని ఆయన అన్నారు. మీడియా కూడా స్వేచ్ఛగా వ్యవహరించలేకపోతోందని, మునుపెన్నడూ లేనంతగా సెన్సార్షిప్ను ఎదుర్కోంటోందని అన్నారు. పాలకుల మాట వినకపోతే మీడియా సంస్థలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. మీడియాలో ఒక వర్గం పాలకుల ఎజెండాను అమలుజేస్తోందని, విభజనవాదాన్ని తెరపైకి తీసుకొస్తోందని అన్నారు.
వారిపై ఈసీ చర్యలు శూన్యం..
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్'ను అమలుజేయలేక పోతోంది. బీజేపీ నాయకులు ఎన్నికల నిబంధనల్ని కనీస స్థాయిలో పాటించకున్నా, మతవిద్వేష ప్రసంగాలు చేసినా వారిపై ఈసీ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వంలో, స్వతంత్ర హోదా కలిగిన వ్యవస్థల్లో పారదర్శకత ఉన్నప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటుంది. కేవలం ఐదేండ్ల కోకమారు ఓటేసినంత మాత్రాన ప్రజాస్వామ్యం రాదు.
ఎన్నికలు మనీ గేమ్ కాదు..
డబ్బులు బాగా ఉన్నవారికి, నిధులు పెద్దమొత్తంలో సమకూరిన వారికి ఎన్నికలు ఒక మనీ గేమ్‌గా మారాయి. ఎన్నికల ప్రచారంలో ఇది స్పష్టంగా కనపడుతోంది. అడ్వర్టయిజ్మెంట్లలో, పోస్టర్లు, భారీ ప్రచార ర్యాలీలతో స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ధనబలానికి, ఇతర పార్టీల ధన బలానికి చాలా తేడా ఉంది. ధనబలంలో ఇతర పార్టీలు బీజేపీతో పోటీ పడలేవు.