Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ఘనిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చర్యలు
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో అక్కడి ప్రభుత్వం, తాలిబన్ల మధ్య అంతర్యుద్ధం నెలకొన్న నేపథ్యంలో కాందహార్ పట్టణంలోని దౌత్యవేత్త కార్యాలయానికి(కాన్సులేట్ జనరల్) చెందిన 50 మంది దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందిని తాత్కాలిక చర్యల్లో భాగంగా ఎయిర్‌ఫొర్స్ విమానం ద్వారా ఢిల్లీకి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితులను భారత నిశితంగా గమనిస్తోందని, మన సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. సిబ్బందిని ఢిల్లీకి తీసుకువచ్చే క్రమంలో విమానం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి మీడియాతో మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్‌ను మూసివేయలేదని, వీసా సంబంధింత పనులను కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి మార్చినట్లు తెలిపారు. స్థానిక సిబ్బందితో కాన్సులేట్ కార్యాలయ నిర్వహణ కొనసాగుతుందని, కాబూల్‌లోని రాయబార కార్యాలయం ద్వారా వీసాలు, ఇతర దౌత్య సంబంధిత సేవలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశామని బగ్చి తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే వారికి సేవలు అందించడంలో కాందహార్ కాన్సులేట్ కార్యాలయం ముఖ్యమైన సమన్వయకర్త పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు సిబ్బంది తరలింపు కారణంగా భారత్‌లోని ఆసుపత్రులకు వెళ్లే ఆఫ్ఘన్ వాసులను వీసా, ఇతర సేవల పరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కాందహార్ శివారు, సమీప ప్రాంతాలను తాలిబన్లు వశపరుచుకున్న నేపథ్యంలో స్థానికంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కాందహార్ జైలుపై శుక్రవారం దాడి చేసిన తాలిబన్లు పెద్ద సంఖ్యలో తాలిబన్ ఖైదీలను తీసుకెళ్లారు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత కార్యాలయాలపై ఉగ్రదాడులు జరిగాయని, ముందస్తు జాగ్రత్తగా సిబ్బంది తరలింపు చేపట్టినట్లు విదేశాంగశాఖ అధికారులు చెబుతున్నారు. అప్ఘనిస్తాన్‌లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలు చేపట్టొదని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే సూచనలు చేసింది.