Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఓయుపై కోవిడ్ పరీక్షల కుంభకోణం నిందితుని సంతకం
- అడ్రసు దుబాయిది.. మూలాలు ముంబయివి
ముంబయి: బ్రెజిల్లో సంచలనం రేపిన కోవాగ్జిన్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా కుంభమేళా కరోనా పరీక్షల కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి ఈ స్కామ్‌లో కూడా పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ స్కామ్‌లో అతని ప్రమేయంపై బ్రెజిల్ మీడియా భారీగా కథనాలను ప్రచురిస్తోంది. అక్కడి దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంపై దృష్టి సారించాయి. భారత్‌లో రెండవ విడత కరోనా విజృంభణకు కారణమైన అనేక అంశాల్లో ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళా కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. కుంభమేళా సందర్భంగా దాదాపుగా లక్షమందికి కరోనా పరీక్షలు నిర్వహించకుండానే జరిపినట్లు రాసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడానికి అనుమతి పొందిన 'మాక్స్ కార్పొరేట్ సంస్థ'కు కనీస మౌలిక వసతులు లేవంటూ జిల్లా కలెక్టర్ తిరస్కరించినా చివరకు ఆ సంస్థే కాంట్రాక్టు దక్కించుకుంది.
ఈ వ్యవహారంలో కొందరు బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే, కోవిడ్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి మాక్స్ సంస్థ నిర్వాహకులతో పాటు, ముంబయికి చెందిన ఇన్విక్సా హెల్త్‌కేర్ సంస్థ అధినేత అనుదేష్ గోయెల్పైనా ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బ్రెజిల్ కోవాగ్జిన్ స్కామ్‌లోనూ ఆయన పేరు ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది.
ఎంఓయులో పేరు!
కోవాగ్జిన్ గేట్ పేరుతో బ్రెజిల్లో భారీగా ప్రచారం పొందిన వ్యాక్సిన్ స్కామ్‌ను అక్కడి దర్యాప్తు సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనిలో భాగంగా కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ చేసుకున్న ఎంఓయును పరిశీలించినప్పుడు అనుదేష్ గోయెల్ పేరు వెలుగులోకి వచ్చింది. 2020, నవంబర్ 24న జరిగిన ఎంఓయులో మూడు సంస్థలు సంతకాలు చేశాయి. వాటిలో ఒకటి భారత్ బయోటెక్, మరొకటి ప్రెసిసా కమర్షియల్ డి మెడికామెంటాస్ లిమిటెడ్. మూడో సంస్థ ఎన్విక్సా ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సి, దుబాయిలో తమ సంస్థ కేంద్ర కార్యాలయం ఉన్నట్టుగా ఎన్విక్సా సంస్థ ఎంఓయులో పేర్కొంది. ఎంఓయుపై పై మిగిలిన రెండు సంస్థలూ స్టాంపులు వేయగా, ఎన్విక్సా ఫార్మాస్యూటికల్ స్టాంపు మాత్రం కనపడటం లేదు. బ్రెజిల్ దర్యాప్తు సంస్థలు చేసిన విచారణలో దుబారులో ఆ పేరుతో ఎటువంటి సంస్థా లేదని తేలింది. దుబారు డిజిటల్ పార్కులోని ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్ అథారిటీ నిర్వహించే రికార్డులతో పాటు, దుబారు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ, ఈ దేశ ఎకనామిక్ రిజిస్టర్లో కూడా ఎన్విక్సా పేరుతో ఏ సంస్థా నమోదైలేదు. దీంతో ఎంఓయులపై చేసిన సంతకాల ఆధారంగా దర్యాప్తు సాగింది. భారత్ బయోటెక్ తరపున డాక్టర్ వి. కృష్ణమోహన్ (పూర్తికాలపు డైరక్టర్). ప్రెసిసా తరపున ఫ్రాన్సిస్కో మాక్సిమనో (ప్రెసిడెంట్) , ఎన్విక్సా ఫార్మాస్యూటికల్స్ తరపున అనుదేష్ గోయెల్ (జనరల్ మేనేజర్)లు ఎంఓయులపై సంతకాలు చేశారు. స్టాంపు స్థానంలో 'ఏ గవాండే' పేరుతో మరో సంతకం ఉంది. కుంభమేళాకు సంబంధించి ఇప్పటికే అనుదేష్ గోయెల్‌ను పోలీసులు విచారిస్తుండటంతో బ్రెజిల్ దర్యాప్తు సంస్థలతో పాటు మీడియా కూడా ఈ విషయమై దృష్టి సారించింది.
ఇవీ అనుమానాలు...
ఒకే పేరుతో ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఉండవచ్చు. అయితే, తాజా కేసులో ఇటువంటి పోలికలు అనేకం ఉన్నాయి. రెండు సంస్థలు ఒకే రంగంలో పని చేస్తున్నాయి. రెండు సంస్థల పేర్లూ (ఎన్విక్సా, ఇన్విక్సా) పలకడానికి ఒకే రకంగా ఉంటాయి. రెండు సంస్థల అధినేతల పేరు (అనుదేష్ గోయెల్) ఒక్కటే! ఇవి చాల వన్నట్టు ఎన్విక్సా తరపున ఎ.గవాండే సంతకం చేయగా, ముంబాయికి చెందిన ఇన్విక్సా సంస్థలో అనఘా గవాండే అనే వ్యక్తి ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో ఇతనే సాక్షిగా సంతకం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెదవి విప్పడం లేదు...!
తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో పూర్తిస్థాయి వివరాలకోసం బ్రెజిల్ మీడియాతో పాటు మనదేశానికి చెందిన 'ది వైర్' చేసిన ప్రయత్నాలకు ఎంఓయులో సంతకాలు చేసిన ఇతర సంస్థలు సహకరించడం లేదు. వ్యాక్సిన్ సరఫరాలో అనుదేష్ గోయెల్‌కు, ఎన్విక్సా సంస్థకు ఉన్న సంబంధంపై భారత్ బయోటెక్‌తో పాటు, బ్రెజిల్‌లోని మరో భాగస్వామ్య సంస్థ ప్రెసిసాను 'వైర్' వివరణ కోరింది. అయితే, ఆ రెండు సంస్థలు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ముంబాయిలోని ఇన్విక్సా సంస్థ కూడా మౌనం వహించింది. తమపై వచ్చిన ఆరోపణలను నిరాకరించడానికి కూడా ఆ సంస్థ ముందుకురాలేదు. కుంభమేళా కరోనా పరీక్షల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్ అధికారి మాత్రం 'ఎన్విక్సా కంపెనీ అనదేష్ గోయెల్ది అవునో కాదో మాకు తెలియదు. అయితే, దుబారులో అతను ఒక కంపెనీ నడుపుతున్నట్లు మాత్రం మాకు సమాచారం ఉంది.' అని చెప్పారు. తాము కరోనా పరీక్షల కేసుపైనే దృష్టి సారించి ఉన్నామని, కోవాగ్జిన్ స్కామ్‌కు సంబంధించి విచారణ జరపాలంటూ ఎటువంటి ఆదేశాలు అందలేదని ఆయన చెప్పారు.