Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షాకు కీలక బాధ్యతల వెనుక...?
- రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైన 'కేంద్ర సహకార మంత్రిత్వశాఖ' ఏర్పాటు
- సమాఖ్య వ్యవస్థపై మరో దాడి : సీపీఐ(ఎం) ొ రాజకీయ దుశ్చర్య : కాంగ్రెస్
న్యూఢిల్లీ : 'కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ' ఏర్పాటు చేస్తున్నామనే మోడీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, ఎన్సీపీ..సహా పలు రాజకీయ పార్టీలు మోడీ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించాయి. సమాఖ్య వ్యవస్థపై జరిగిన మరో దాడిగా సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్లలో పెద్ద సంఖ్యలో ఉన్న సహకార సంఘాలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. పలు రాష్ట్రాల్లోని ఈ సహకార సంఘాలపై రాజకీయంగా నియంత్రణ సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దాంట్లో భాగంగానే కేంద్ర సహకార శాఖను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు అప్పజెప్పారని కాంగ్రెస్ ఆరోపించింది.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయటం, దానిని అమిత్ షాకు అప్పజెప్పటం వెనుక రాజకీయంగా పెద్ద వ్యూహమే ఉందని మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్విరాజ్ చౌహాన్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలను రాజకీయంగా దెబ్బతీయటం కోసమే మంత్రిత్వశాఖను తీసుకొస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ ఆరోపించారు.
వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని, ఈ మంత్రిత్వశాఖతో బీజేపీ ప్రజలకు చేసేదేమీ లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా అని..ఆయన విమర్శించారు. రాష్ట్రాల హక్కుల్ని, అధికారాల్ని దెబ్బకొట్టడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మంత్రిత్వశాఖను కేంద్ర హోంశాఖను చూస్తున్న అమిత్ షాకు అప్పజెప్పటంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
సహకారం తీరు తెన్నులు...
దేశవ్యాప్తంగా దాదాపు 1,94,195 సహకార డైరీ సంఘాలు, 330 సహకార చక్కెర మిల్లులు ఉన్నాయని సమాచారం. నాబార్డ్ లెక్కల ప్రకారం, 95,238 గ్రామస్థాయి వ్యవసాయ రుణసంఘాలు, 363 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), 33 రాష్ట్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో రూ.1,35,393కోట్ల డిపాజిట్లు ఉండగా, రూ.1,48,625కోట్లు రుణాలు ఇచ్చాయి. స్వల్పకాలిక రుణాలు ఇచ్చే డీసీసీబీల్లో డిపాజిట్లు రూ.3,78,248కోట్లుకాగా, రూ.3లక్షల కోట్లు రుణాలు అందజేశాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం మనదేశంలో మొత్తం 1539 పట్టణ సహకార బ్యాంకులున్నాయి.
సహకార బ్యాంకుల్ని దోచుకోవటం కోసమే : ఏచూరి
కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటును వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ''సహకార సంఘాలు..రాష్ట్రాల పరిధిలోని అంశమని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ స్పష్టం చేస్తోంది. అలాంటిది కేంద్రం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను తీసుకురావటం..సమాఖ్య వ్యవస్థపై దాడి చేయటమే. తమకు అనుకూలమైన కార్పొరేట్లకు వేలకోట్ల రుణాలు ఇస్తూ ప్రభుత్వ బ్యాంకుల్ని పాలకులు దోచుకుంటున్నారు. ఇప్పుడు వారి కన్ను సహకార సంఘాలు, సహకార బ్యాంకులపై పడింది. వాటిలో డిపాజిట్లను దోచుకోవటం కోసమే ఈ కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు'' అని అన్నారు.