Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జాతీయ భద్రత పేరుతో ఓ ముస్లిం ఉపాధ్యాయురాలిని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. గతంలో ఆమె తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపటంతో.. నష్టపరిహారం కింద జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం రజియా సుల్తానాను టీచర్‌గా నియమించింది. 20 ఏండ్ల అనంతరం ఎటువంటి కారణం లేకుండా, విచారణ లేకుండానే తనను విధుల నుంచి తొలగించినట్టు రజియా సుల్తానా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతనాగ్ జిల్లాలోని మిడిల్ స్కూల్ ఖైరాన్ ప్రధానొపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న తనను తొలగించినట్లు నోటీసులు ఇచ్చారని, కారణం చెప్పలేదని అన్నారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 311 సబ్‌క్లాజ్ (సి)లోని క్లాజ్ 2 ప్రకారం.. జాతీయ భద్రత దృష్ట్యా విచారణ జరపాల్సిన అవసరం లేకుండానే చర్యలు తీసుకున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. ఈ నిరాధారమైన, ఊహాత్మక ఆరోపణలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తాను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదనీ, ఎందుకు విధుల నుంచి తొలగించారో వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టు సుల్తానా తెలిపారు. కాగా, సుల్తానా తండ్రి, జమాతి ఇస్లామి సభ్యుడైన మొహ్మద్ సుల్తానా భట్ 1987లో జరిగిన ఎన్నికల్లో ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ (ఎంయుఎఫ్) అభ్యర్థిగా పోటీచేశారు. 1996లో కొందరు ఉగ్రవాదులు అతనిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు. నష్టపరిహారం కింద 2000 సంవత్సరంలో రజియా సుల్తానాను ప్రభుత్వం ఉపాధ్యాయురాలిగా నియమించింది. ఆ సమయంలో పోలీసులు విచారణ జరిపి, ఎటువంటి వ్యతిరేకత లేదంటూ ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించినట్టు ఆమె తెలిపింది. సుల్తానాతో పాటు మరో 11 మందిని విధుల నుంచి తొలగించారు. వారంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.